16 ఏళ్ల తర్వాత సాధువు రూపంలో ఇంటికి వచ్చిన ‘కొడుకు’; రాత్రంతా సంబరాలు, ఉదయం చూసేసరికి తల్లిదండ్రులకు మైండ్ బ్లాక్!

బీహార్‌లోని బాంకా జిల్లాలో వెలుగుచూసిన ఒక మోసం కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. 16 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు కళ్లముందు ప్రత్యక్షమవడంతో ఆ తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. ఆ దంపతులు అతడిని తమ కొడుకుగా భావించి ఇంట్లోకి ఆహ్వానించారు, దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. అయితే, ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన ఈ ‘కొడుకు’ తల్లిదండ్రులనే మోసం చేసి పరారయ్యాడు.

ఈ ఘటన పంజవార పోలీస్ స్టేషన్ పరిధిలోని డహువా పంచాయతీ హేచలా గ్రామంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వారి కుమారుడు ఏళ్ల క్రితం ఢిల్లీలో తప్పిపోయాడు. అప్పటి నుండి అతని గురించి ఎటువంటి సమాచారం లేదు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సాధువుల వేషంలో వచ్చిన ఇద్దరు యువకులు
పోలీసుల సమాచారం ప్రకారం, శనివారం (మే 9) సారంగి వాయిస్తూ సాధువుల వేషంలో ఇద్దరు యువకులు ఆ గ్రామానికి చేరుకున్నారు. వారిలో ఒక యువకుడు తాను అజీమ్ అన్సారీ కుమారుడైన సికందర్ అన్సారీనని, 16 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తిని అని చెప్పుకున్నాడు.

గురువు నుండి విముక్తి కోసం డబ్బు డిమాండ్
గ్రామస్థులు కొందరు ఆ యువకుడిపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ, ఆ తల్లిదండ్రులు మాత్రం పుత్రవాత్సల్యంతో ఏమీ ఆలోచించకుండా అతడిని తమ కొడుకుగా అంగీకరించారు. ఆ తర్వాత ఆ వ్యక్తి తాను ఒక ‘గురువు’ బంధనంలో ఉన్నానని, ఆ బంధం నుండి విముక్తి పొందాలంటే పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన ఆ కుటుంబం సుమారు రూ. 1,40,000 ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయడమే కాకుండా, మరో రూ. 60,000 నగదును కూడా ఇచ్చారు.

అత్తగారింటికి వెళ్లిన వైనం
ఆదివారం (మే 10) ఉదయం కుటుంబ సభ్యులు నిద్రలేచి చూసేసరికి ఆ ఇద్దరు యువకులు కనిపించలేదు. ఇంట్లో ఉన్న బైక్ కూడా మాయమైంది. తాము మోసపోయామని గ్రహించిన ఆ దంపతులు లబోదిబోమన్నారు. కొడుకు వచ్చాడన్న సంతోషం ఉన్న ఆ ఇంట్లో నిశ్శబ్దం ఆవరించింది. ఇంతేకాకుండా, ఆ యువకులు సికందర్ అన్సారీ అత్తగారింటికి కూడా వెళ్లారు. అక్కడ సికందర్ భార్య రోష్ని ఖాటూన్‌ను కలిశారు, కానీ ఆమె ఆ యువకుడిని గుర్తించడానికి నిరాకరించింది. అక్కడ పప్పులు ఉడకవని గ్రహించిన ఆ కేటుగాళ్లు అక్కడి నుండి కూడా పరారయ్యారు.


Posted

in

by

Tags: