16 ఏళ్ల బాలుడి ఘోర కలకలం.. కన్న ఇంట్లోనే రక్తపాతం! అన్న, వదిన, మూడేళ్ల మేనల్లుడిని నరికి చంపిన తమ్ముడు.. అసలు కారణం ఏంటి?

గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో 16 ఏళ్ల ఓ మైనర్ బాలుడు కన్న ఇంట్లోనే నరమేధానికి ఒడిగట్టాడు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ త్రిపుల్ మర్డర్ (ముగ్గురి హత్య) ఉదంతం స్థానికంగా కార్చిచ్చులా వ్యాపించింది. ఒక మైనర్ బాలుడు తన పెద్దన్న అమితాబ్ గదిలోకి చొరబడి.. గాఢ నిద్రలో ఉన్న అన్న, వదిన రంజన, వారి మూడేళ్ల కుమారుడు రేయాంచ్‌లను అత్యంత కిరాతకంగా నరికి చంపాడనే వార్త వినగానే స్థానికులు మొదట నమ్మలేకపోయారు. కానీ, ఈ సంచలన హత్యోదంతం నిజమేనని తేలడంతో.. రోజురోజుకూ బలహీనపడుతున్న రక్తసంబంధాల తీరుపై ప్రజలు తీవ్ర ఆందోళన, విచారం వ్యక్తం చేస్తున్నారు.

హత్యకు పాల్పడిన మైనర్ తమ్ముడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించడంతో పాటు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, అంత చిన్న వయసులోనే ఒక బాలుడు ఇంతటి ఘోరానికి ఎందుకు తెగించాడనే ప్రశ్న అందరి మెదడునూ తొలిచేస్తోంది.

ద్వేషానికి కారణం అదేనా?.. వేర్వేరు కోణాలు:
ఈ దారుణ ఘటన తర్వాత స్థానికంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హత్యకు గురైన పెద్దన్న గతంలో వేరే ఊరిలో ఉంటూ కూలీ పనులు చేసుకునేవాడు. కొన్ని నెలల క్రితమే అతను సొంత గ్రామానికి తిరిగి వచ్చాడు. ఊరికి వచ్చినప్పటి నుండి అన్నదమ్ముల మధ్య సంబంధాలు అస్సలు బాలేవు. తల్లిదండ్రులు కూడా పెద్దన్న, అతని కుటుంబం వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని, తనను నిర్లక్ష్యం చేస్తున్నారని చిన్న తమ్ముడు మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం.. నిందితుడు పోలీసుల ఎదుట తనను ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారంటూ అనేక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అయితే పోలీసులు ఇంకా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు, ఈ గుప్తా కుటుంబానికి ఒక సొంత దుకాణం (షాప్) ఉంది. ఆ షాపులో ఎక్కువ భాగం ఈ చిన్న కొడుకే కూర్చునేవాడు. పెద్దన్న ఊరికి వచ్చినప్పటి నుండి ఈ దుకాణం విషయంలోనూ ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఎక్కడ పెద్దన్న వచ్చి తన దుకాణాన్ని ఆక్రమించుకుంటాడేమో అనే భయం కూడా చిన్నోడిలో ఉండి ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు.

తొమ్మిదో తరగతి వరకే చదువు – ఇంట్లో గొడవలు:
నిందితుడైన సదరు బాలుడు తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నట్లు తెలుస్తోంది. అతని తండ్రి హరిలాల్ గుండె జబ్బు (హార్ట్ పేషెంట్) బాధితుడు. ప్రస్తుతం ఆయనకు యూరినల్ పైప్ అమర్చి ఉంది. తల్లి కూడా అనారోగ్యంతో మందులు వాడుతోంది. సుమారు రెండు నెలల క్రితం తండ్రికి, ఈ చిన్న కొడుకుకు మధ్య పెద్ద గొడవ జరగ్గా.. అప్పట్లో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చినట్లు సమాచారం.

అసలు ఆ రాత్రి ఏం జరిగింది?
గోరఖ్‌పూర్ త్రిపుల్ మర్డర్ కథనం ప్రకారం.. నిందితుడు సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అన్న గదిలోకి చొరబడ్డాడు. ఆ రెండంతస్తుల ఇంట్లో కింది భాగంలో తల్లిదండ్రులు, పెద్దన్న కుటుంబం నివసిస్తుండగా.. నిందితుడైన చిన్న తమ్ముడు పై అంతస్తు గదిలో ఉండేవాడు.

పెద్దన్న అమిత్, అతని భార్య, మూడేళ్ల కొడుకు రేయాంచ్, వారి తొమ్మిదేళ్ల కుమార్తెతో కలిసి గదిలో నిద్రిస్తున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉండటం చూసి, నిందితుడు ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో వారిపై విచక్షణారహితంగా దాడి చేయడం ప్రారంభించాడు. వారు కనీసం తప్పుకోవడానికి లేదా ఎదురు తిరగడానికి కూడా సమయం దొరకలేదు. పదే పదే దాడి చేసి అమిత్, రంజన, చిన్నారి రేయాంచ్‌లను అక్కడికక్కడే ప్రాణాలు తీశాడు. అయితే, విచిత్రంగా పక్కనే ఉన్న తొమ్మిదేళ్ల చిన్నారిని మాత్రం ఏమీ చేయకుండా వదిలేశాడు.

హత్యల తర్వాత కూడా పారిపోలేదు:
ఒకే ఇంట్లో ముగ్గురిని నరికి చంపిన తర్వాత కూడా ఆ బాలుడు ఎక్కడికీ పారిపోలేదు. నేరానికి పాల్పడిన వెంటనే నేరుగా పై అంతస్తులో ఉన్న తన గదికి వెళ్లి కూర్చున్నాడు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని ఆ గది నుండే అదుపులోకి తీసుకున్నారు.


Posted

in

by

Tags: