ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో అన్వర్గంజ్ ప్రాంతంలో బర్త్‌డే పబ్లిసిటీ కోసం పెట్టిన ఒక వింత ఆఫర్ తీవ్ర గందరగోళానికి దారితీసింది.
కేవలం రూ.16కే దుస్తులు, ఇతర వస్తువులు లభిస్తాయన్న ప్రచారాన్ని నమ్మి అర్ధరాత్రి వేళ వేలాది మంది జనం ఎగబడటంతో భారీ ట్రాఫిక్ జామ్, తొక్కిసలాట చోటుచేసుకుంది.
అన్వర్గంజ్ ప్రాంతంలోని ‘ఆలమ్ షాపింగ్ మార్ట్’ యజమాని రయీస్ ఆలమ్ తన పుట్టినరోజు సందర్భంగా మార్ట్‌ను పాపులర్ చేసేందుకు ఒక ప్లాన్ వేశాడు. తన బర్త్‌డే సందర్భంగా అర్ధరాత్రి “కేవలం 16 నిమిషాల పాటు స్టోర్‌లోని వస్తువులన్నీ రూ.16లకే ఇస్తాం” అంటూ కాన్పూర్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో రీల్స్ చేయించి విస్తృతంగా ప్రచారం చేయించాడు.
ఈ రూ.16 ఆఫర్ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో, అర్ధరాత్రి వేళ వేలాది మంది యువకులు, స్థానికులు మార్ట్ ముందు భారీగా గుమిగూడారు. ఒక్కసారిగా జనం పోటెత్తడంతో ప్రధాన రహదారులన్నీ స్తంభించిపోయాయి. దుకాణంలోకి చొచ్చుకెళ్లే క్రమంలో తీవ్ర తొక్కిసలాట జరిగి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
పరిస్థితి చేయిదాటిపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు జనాన్ని చెదరగొట్టారు. రద్దీని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ, పోలీసు అధికారులు దానిని ఖండించారు. తప్పుడు ప్రకటనల వల్ల జనం గుమిగూడారని, వారిని శాంతియుతంగా అక్కడి నుంచి పంపించివేశామని వెల్లడించారు.
వెంటనే ఆ షాపింగ్ మార్ట్‌ను మూసివేయించిన పోలీసులు.. పబ్లిసిటీ పిచ్చితో తప్పుడు ప్రచారాలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన షాపు యజమాని రయీస్ ఆలమ్‌తో పాటు సహకరించిన ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
