మధ్యప్రదేశ్ రాష్ట్రం టెహ్రవారా గ్రామంలో గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ఇద్దరు బాలికలు శనివారం ఉదయం ఒక బావిలో శవాలై తేలిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, సంచలనాన్ని సృష్టించింది.
టెహ్రవారా గ్రామానికి చెందిన రాజేంద్ర ఠాకూర్ 16 ఏళ్ల కుమార్తె కీర్తి ఠాకూర్, అతని సోదరుడు సుగర్ సింగ్ ఠాకూర్ 17 ఏళ్ల కుమార్తె పూనమ్ ఠాకూర్ ఈ ఘటనలో మరణించారు. గత జూలై 16వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్న ఈ బాలికలు, అర్ధరాత్రి 1 గంట సమయంలో పడకలపై నుండి హఠాత్తుగా మాయమయ్యారు.
కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికినా బాలికల జాడ దొరకకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు జూలై 17న గుర్తుతెలియని వ్యక్తులపై కిడ్నాప్ కేసు నమోదు చేసి తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో, శనివారం ఉదయం బాలికల ఇంటికి సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న ఒక బావి సమీపంలో ఒక బాలిక చెప్పులు పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామస్తుల సహాయంతో సుమారు 70 అడుగుల లోతున్న ఆ బావి నుండి మోటార్ల ద్వారా 40 అడుగుల వరకు నీటిని బయటకు తోడేసి పరిశీలించారు.
నీటి మట్టం తగ్గడంతో, బావి లోపల ఇద్దరు బాలికల మృతదేహాలు తేలడం గమనించి, గ్రామస్థుల సహాయంతో వాటిని బయటకు తీశారు. ఈ ఘటనలో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మృతదేహాలను వెలికితీసే ముందు రోజు వరకు గ్రామస్తులు అదే బావి నుండి నీటిని పట్టుకున్నారు. కానీ, ఆ సమయంలో బావిలో శవాలు ఉన్నట్లు ఎవరూ గమనించకపోవడం గమనార్హం.
ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ నీతూ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. “తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కిడ్నాప్ కేసు నమోదైంది. ప్రస్తుతం మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించాం. ఈ కేసులో ఒక ముఖ్యమైన మలుపుగా, బాలికల్లో ఒకరు నిరంతరం మాట్లాడుతున్న ఒక సెల్‌ఫోన్ నంబర్‌ను గుర్తించాం. ఆ నంబర్ ఆధారంగా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయి” అని చెప్పారు.
