హర్యానాలోని నూహ్ జిల్లా నుండి మానవత్వాన్ని మంటగలిపే ఒక భయంకరమైన ఘటన వెలుగుచూసింది. నూహ్‌లో ఐదుగురు యువకులు ఒక 16 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, ఆపై ఆమెపై అత్యంత క్రూరంగా సమూహ లైంగిక దాడికి (గ్యాంగ్ రేప్) పాల్పడినట్లు సమాచారం.
బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 6 (శనివారం) ఉదయం 5:00 గంటలకు ఆయన నిద్రలేచి చూసేసరికి తన కుమార్తె ఇంట్లో కనిపించలేదు. ఆ తర్వాత కొంత సమయానికి కొందరు వ్యక్తులు ఆమెను మోటార్ సైకిల్‌పై తీసుకువచ్చి ఇంటి వద్ద వదిలివెళ్లారు.
ఆందోళన చెందిన తండ్రి కుమార్తెను అసలేం జరిగిందని నిలదీయగా.. ‘షౌకీన్’ అనే వ్యక్తి వద్ద తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు ఉన్నాయని, వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని అతను బెదిరించాడని బాలిక ఏడుస్తూ చెప్పింది. ఆ తర్వాత ఐదుగురు యువకులు కలిసి తనపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వివరించింది. నిందితుడైన షౌకీన్‌కు గతంలో ఆ బాలిక ఇంటి సమీపంలో ఒక కిరాణా దుకాణం ఉండేది.
అడవిలోకి తీసుకెళ్లి దారుణం: తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మహిళా పోలీస్ స్టేషన్లో ‘పోక్సో’ (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో షౌకీన్‌తో పాటు మరో నలుగురు వ్యక్తులపై బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ 5వ తేదీ రాత్రి తనను బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లి, ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
నిందితుల్లో ఒకరు మైనర్: ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులలో ఒకరు మైనర్ (బాలనేరస్థుడు) అని సమాచారం. నిందితులందరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Leave a Reply