ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ ప్రాంతంలో, ప్రైవేట్ స్లీపర్ బస్సులో 16 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, కండక్టర్‌లను ఢిల్లీ పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు.
బాధిత బాలిక ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన 11వ తరగతి విద్యార్థిని. కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె, నోయిడాలోని తన బంధువుల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది.
అయితే ఆ సమయంలో వర్షం పడుతుండటం, రాత్రి సమయం కావడంతో మార్గమధ్యంలోని ఓ కూడలి వద్ద దిగి బస్సు కోసం ఎదురుచూసింది. సరిగ్గా అదే సమయంలో అటుగా ఖాళీగా వచ్చిన స్లీపర్ బస్సును ఆపి ఎక్కింది.
బస్సు డ్రైవర్ కుల్‌దీప్, కండక్టర్ సందీప్ ఆ బాలికను నోయిడాలో దించుతామని చెప్పి బస్సులోకి ఎక్కించుకున్నారు. కానీ, బస్సు కొంత దూరం వెళ్లిన తర్వాత వారిద్దరూ కలిసి బాలికను బెదిరించి లైంగిక వేధింపులకు గురిచేశారు.
అనంతరం కాశ్మీరీ గేట్ సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద బాలికను దించేసి వెళ్లిపోయారు. భయాందోళనకు గురైన ఆ విద్యార్థిని నేరుగా కాశ్మీరీ గేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

Leave a Reply