దీపావళికి ముందు రోజు జరుపుకునే నరక చతుర్దశిని చిన్న దీపావళి (చోటీ దీపావళి) అని కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడు అనే రాక్షసుడిని వధించాడనే పౌరాణిక కథతో దీనికి సంబంధం ఉంది.
ఈ సంవత్సరం నవంబర్ 8వ తేదీన నరక చతుర్దశిని జరుపుకుంటున్నారు. పురాణాల ప్రకారం, ఒకప్పుడు నరకాసురుడు అనే అత్యంత బలవంతుడైన రాక్షసుడు ప్రాగ్జ్యోతిషపురం అనే రాజ్యాన్ని పాలించేవాడు. తన బలగర్వంతో భూలోకంలోనూ, దేవలోకంలోనూ ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడు. దేవతలు, మునులనే కాకుండా సామాన్య ప్రజలను కూడా హింసించడంతో ముల్లోకాల ప్రజలు వాడిని చూసి భయపడిపోయేవారు.
రోజురోజుకూ పెరిగిపోతున్న వాడి అకృత్యాలకు పరాకాష్టగా, పలువురు రాజులు, దేవతల కుమార్తెలు సహా మొత్తం 16,108 మంది మహిళలను బంధించినట్లు పురాణ కథ చెబుతోంది. తన అధికారాన్ని, ఆధిపత్యాన్ని చెలాయించడానికి వారిని బానిసలుగా ఉంచుకుని నానా చిత్రహింసలకు గురిచేసేవాడని అంటారు. ఆ రాక్షసుడి చెరలో చిక్కుకున్న మహిళలు విముక్తి దొరక్క నరకయాతన అనుభవించారు. నరకాసురుడి దురాగతాలతో ముల్లోకాల్లోనూ భయం, ఆందోళన నెలకొన్నాయని ఈ పురాణ కథ వివరిస్తోంది.
నరకాసురుడి అకృత్యాలకు ముగింపు పలకాలని శ్రీకృష్ణ భగవానుడు నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత తన భార్య సత్యభామతో కలిసి గరుడ వాహనంపై ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాడు. అక్కడ నరకాసురుడికి, శ్రీకృష్ణుడికి మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి, వాడి చెరసాలలో ఉన్న 16,108 మంది మహిళలను విడిపించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ విజయంతో రాక్షసుడి పీడ విరగడై, విముక్తి లభించినందుకు గుర్తుగా నరక చతుర్దశిని జరుపుకుంటారని నమ్ముతారు.
విముక్తి పొందిన మహిళలు తిరిగి సమాజంలో గౌరవంగా జీవించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా పురాణ కథ చెబుతోంది. ఆనాటి సామాజిక ఆంక్షల కారణంగా, రాక్షసుడి చెరలో ఉన్న ఆ మహిళలను అంగీకరించడానికి సమాజం వెనకాడిందని అంటారు. దీంతో ఆ మహిళలకు తగిన గౌరవం, సామాజిక గుర్తింపు లభించాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు వారిని తన భార్యలుగా స్వీకరించాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అందుకే నరక చతుర్దశి అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగానే కాకుండా, రాక్షసుడి చెర నుంచి మహిళలకు విముక్తి కల్పించిన రోజుగా కూడా పరిగణించబడుతుంది.

Leave a Reply