గిగ్ వర్కర్ల భద్రత మరియు వారి పని పరిస్థితులపై దేశంలో పెద్ద చర్చ జరుగుతోంది. ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతున్న తరుణంలో, ఈ రంగంలోని లోపాలు వెలుగులోకి వస్తున్నాయి.
మారుతున్న పరిస్థితులు.. మారని కష్టాలు:
- అదృశ్య గడియారం: కంపెనీలు ప్రకటనల నుండి ’10 నిమిషాలు’ అనే పదాన్ని తొలగించినా, వారి యాప్ అల్గారిథమ్స్ మరియు పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ మాత్రం ఇప్పటికీ అదే వేగాన్ని కోరుతున్నాయి. రైడర్ యాప్‌లో నడిచే అదృశ్య గడియారం అతన్ని మునుపటి కంటే వేగంగా పరుగెత్తేలా చేస్తోంది.
- ఒక్కో ఆర్డర్‌కు ₹14: టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఒక డెలివరీ రైడర్ సంపాదన చాలా తక్కువ. సుమిత్ వంటి రైడర్లు ప్రతి ఆర్డర్‌కు సగటున కేవలం ₹14 సంపాదిస్తారు. నెలకు ₹25,000 నుండి ₹30,000 సంపాదించాలంటే, రోజుకు 30 నుండి 35 డెలివరీలు చేయాలి. అంటే సెలవు లేకుండా రోజుకు 10 నుండి 12 గంటలు పని చేయాల్సిందే.
రైడర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు:
- కస్టమర్ల ఒత్తిడి: ప్రజలు ‘సూపర్ ఫాస్ట్’ డెలివరీకి అలవాటు పడిపోయారు. ట్రాఫిక్ వల్ల ఆలస్యమైతే కస్టమర్లు రైడర్లపై కోపం చూపిస్తున్నారు. కొన్నిసార్లు నగదు చెల్లించడానికి కూడా నిరాకరిస్తున్నారు.
- ఐడీ బ్లాక్ అయ్యే భయం: ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఆర్డర్ తిరస్కరిస్తే, యాప్ వారి ఐడీని బ్లాక్ చేస్తుంది. దీనివల్ల ఆ రోజు సంపాదన పోవడమే కాకుండా పెనాల్టీలు కూడా పడతాయి.
- ప్రాణాలకు తెగించి పరుగు: సమయం ఆదా చేసే క్రమంలో రాంగ్ రూట్లో వెళ్లడం, రెడ్ లైట్ జంప్ చేయడం వీరికి తప్పనిసరి అవుతోంది. 2025 డిసెంబర్లో ఒక రైడర్ తన కష్టార్జితంలో ₹6,000 కేవలం ట్రాఫిక్ చలాన్లకే చెల్లించాల్సి వచ్చింది.
- ఆరోగ్యంపై ప్రభావం: 25-30 కిలోల బరువున్న బ్యాగులను వీపుపై మోస్తూ అంతస్తులు ఎక్కడం వల్ల రైడర్లు వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పుల బారిన పడుతున్నారు.
- వివక్ష: హై-రైజ్ సొసైటీలలో డెలివరీ బాయ్స్ ప్రధాన లిఫ్ట్‌లను వాడకూడదని, కేవలం సర్వీస్ లిఫ్ట్‌లనే వాడాలని నిబంధనలు పెట్టడం వారి పట్ల సమాజంలో ఉన్న వివక్షకు అద్దం పడుతోంది.
భీమా ఉన్నా దక్కని వైనం:
చాలా మంది రైడర్ల యాప్‌లో ఇన్సూరెన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ప్రమాదం జరిగినప్పుడు ఆ క్లెయిమ్ ఎలా పొందాలో వారికి తెలియదు. సరైన అవగాహన కల్పించేవారు లేక వారు ఈ ప్రయోజనాలను కోల్పోతున్నారు.
