సినిమా విజయానికి భారీ బడ్జెట్, అగ్ర తారలు, పెద్ద నిర్మాణ సంస్థలే ఉండాల్సిన అవసరం లేదు. కథ బాగుంటే ఏ శక్తీ ఆ సినిమా విజయాన్ని ఆపలేదని నిరూపించిన చిత్రం ఇది. 17 ఏళ్ల అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కేవలం ₹15 కోట్లతో రూపొంది ఏకంగా ₹900 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
సుమారు 9 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం, దాని లోతైన కథా బలంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 2017లో అద్వైత్ చందన్ దర్శకత్వంలో వచ్చిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ (Secret Superstar) అనే సినిమానే ఈ ఘనత సాధించింది. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రంలో జైరా వసీమ్ ప్రధాన పాత్ర పోషించింది. గాయని కావాలని కలలుగనే ఒక పాఠశాల విద్యార్థిని, తన ముఖం కనిపించకుండా బురఖా ధరించి పాటలు పాడుతూ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంది. రాత్రికి రాత్రే ఆమె గొంతు దేశవ్యాప్తంగా ఫేమస్ అవుతుంది.
ఆ తర్వాత ఆమె జీవితంలో జరిగిన మార్పులే ఈ సినిమా కథ. పితృస్వామ్య వ్యవస్థ, మహిళలపై హింస, తల్లి-కూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగ బంధాన్ని ఈ సినిమా అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ చిత్రం కేవలం భారతదేశంలోనే కాకుండా చైనాలో అనూహ్య విజయాన్ని అందుకుంది. భారత్‌లో ₹65 కోట్లు వసూలు చేస్తే, చైనాలో ఏకంగా ₹750 కోట్లు, హాంకాంగ్‌లో ₹65 కోట్లు సాధించి రికార్డు సృష్టించింది.
ఈ సినిమాలో అమీర్ ఖాన్ ఒక కీలక అతిథి పాత్రలో నటించారు. జైరా వసీమ్ తన 18వ ఏటనే నటనకు స్వస్తి చెప్పారు. ‘ది స్కై ఈజ్ పింక్’ ఆమె చివరి చిత్రం. జైరా నటించిన ‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹3000 కోట్లు వసూలు చేయడం ఒక చారిత్రాత్మక రికార్డు.
