కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో గత అక్టోబర్ 25న లగ్జరీ కారు ఢీకొని మృతి చెందిన 55 ఏళ్ల జయబాలకృష్ణన్ కుటుంబ సభ్యులు, ఆయన మరణించిన మూడు వారాల్లోనే మళ్లీ దోశ దుకాణాన్ని ప్రారంభించారు.
ఏళ్ల తరబడి కుటుంబానికి జీవనాధారంగా ఉన్న ఆ దుకాణాన్ని ఆయన భార్య బిందు, కుమార్తె భద్రా కీర్తి కలిసి కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 16న జయబాలకృష్ణన్ చిత్రపటం ముందు దీపం వెలిగించి దుకాణాన్ని పునఃప్రారంభించారు.
చేరానల్లూర్ ప్రాంతంలోని చిత్తూర్ శ్రీ కృష్ణ ఆలయం సమీపంలో ఉన్న ఈ దుకాణం ‘బాలేట్టన్ దోశ షాప్’ లేదా ‘శ్రీ కృష్ణా టీ స్టాల్’ పేరుతో నడుస్తుండేది. సుమారు 20 నుంచి 25 ఏళ్లుగా జయబాలకృష్ణన్, ఆయన భార్య కలిసి దోశలు, ఆమ్లెట్, చట్నీ, టీ తదితరాలను విక్రయిస్తూ వచ్చారు. ఈ దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతోనే తమ ముగ్గురు పిల్లల చదువులతో పాటు కుటుంబ ఖర్చులన్నింటినీ చూసుకునేవారు.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న కుమార్తె భద్రా కీర్తి, తండ్రి మరణం తర్వాత తన ఉద్యోగానికి తాత్కాలికంగా విరామం ఇచ్చి తల్లికి తోడుగా ఉండేందుకు ఇంటికి తిరిగి వచ్చారు. కుమారులు కూడా దుకాణాన్ని మళ్లీ తెరిచే పనుల్లో కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా నిలిచారు. తండ్రి నడిపిన తరహాలోనే దుకాణాన్ని కొనసాగిస్తామని, ఆయన మరణానికి న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
అక్టోబర్ 25 తెల్లవారుజామున దుకాణం మూసివేసి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్న జయబాలకృష్ణన్‌ను కంటైనర్ రోడ్డులోని మారప్పరంబు సమీపంలో వెనుక నుంచి వచ్చిన మెర్సిడెస్ బెంజ్ కారు ఢీకొట్టింది. ఆ కారును 17 ఏళ్ల బాలుడు నడిపినట్లు సమాచారం. గంటకు 100 కి.మీ. పైగా వేగంతో కారు దూసుకెళ్లినట్లు చెబుతుండగా, తీవ్రంగా గాయపడిన జయబాలకృష్ణన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో బాలుడి తండ్రి అయిన అదనపు జిల్లా న్యాయమూర్తిపైనా అభియోగాలు నమోదయ్యాయి. కుటుంబ సభ్యులు, ప్రజల ఆందోళనల అనంతరం ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105ను కూడా చేర్చారు. దర్యాప్తును జిల్లా క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. బాలుడికి జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేయగా, దానిని రద్దు చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయం కోసం వారి పోరాటం కొనసాగుతోంది.

Leave a Reply