ఏడు నెలలుగా నిరంతరం ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా లభించని ఓ యువకుడి అనుభవం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
175 సంస్థల్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసిన అతడు, ఇప్పటివరకు 55 ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. అందులో 25 సార్లు ఫైనల్ రౌండ్ వరకు వెళ్లినా.. ఏ ఒక్క కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ రాలేదు. నిరంతరం ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కకపోవడంతో అతని ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది. నిరుద్యోగులకు ఇచ్చే నిరుద్యోగ భృతి గడువు కూడా ముగియడంతో, రోజువారీ ఖర్చులను వెళ్లదీయడానికే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు అతడు వాపోయాడు.
తన పరిస్థితిని వివరిస్తూ ఆ యువకుడు ‘రెడిట్’ (Reddit) సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. ఏడు నెలలుగా ఉద్యోగ వేటలో ఉన్నానని, ప్రతిసారీ చివరి రౌండ్ వరకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్యోగం లేకపోవడం వల్ల క్రమం తప్పకుండా కొనుగోలు చేసే ప్రోటీన్ డ్రింక్‌ను కూడా ఇప్పుడు కొనలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నాడు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం కూడా తన ఆర్థిక భారాన్ని మరింత పెంచిందని తెలిపాడు. ఇన్ని ఇంటర్వ్యూలకు హాజరైనా ఒక్క ఉద్యోగం కూడా దక్కకపోవడం అతడిని తీవ్ర నిరాశ, ఆందోళనకు గురిచేసింది.
వరుసగా పలు కంపెనీలకు దరఖాస్తు చేసి నిరాశ చెందిన అతడు, ఇప్పుడు తన ఉద్యోగ అన్వేషణ విధానాన్నే మార్చేశాడు. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి తనకోసం ప్రత్యేకంగా ఓ ‘ఏఐ ఏజెంట్’ (AI Agent)ను క్రియేట్ చేశాడు. తన రెజ్యూమ్, పని అనుభవం, నైపుణ్యాలకు సంబంధించిన వివరాలను దానికి అందించాడు. దాని ఆధారంగా ఆ ఏఐ ఏజెంట్ ఇంటర్నెట్లో అతనికి సరిపోయే ఉద్యోగ అవకాశాలను వెతికి పెడుతుంది. ముఖ్యంగా, తన అర్హత, అనుభవంతో 95 శాతం లేదా అంతకంటే ఎక్కువ సరిపోయే (మ్యాచ్ అయ్యే) ఉద్యోగాలకు మాత్రమే ఇకపై దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నట్లు అతడు తెలిపాడు. దీని ద్వారా సరిపోలని ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూ వృథా అయ్యే సమయాన్ని ఆదా చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో, చాలా మంది నెటిజన్లు తమ ఉద్యోగ అన్వేషణ అనుభవాలను పంచుకున్నారు. ఒక వ్యక్తి నాలుగు నెలలుగా ఉద్యోగం వెతుకుతున్నా, ఒక్కసారి మాత్రమే ఫైనల్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నానని చెప్పగా.. మరొకరు ఫిబ్రవరిలో ఉద్యోగం కోల్పోతే, మళ్లీ ఆగస్టులో కొత్త ఉద్యోగం దొరికిందని పేర్కొన్నాడు. ఫైనల్ రౌండ్ వరకు పలుమార్లు వెళ్లడమంటే విఫలమైనట్లు కాదని, సరైన అవకాశం దొరికే వరకు ప్రయత్నాన్ని కొనసాగించాలని కొందరు ఆ యువకుడికి ధైర్యం చెప్పారు. డిగ్రీ, అనుభవం, ఇంటర్వ్యూలు.. ఇలా అన్ని దశలూ దాటుకుని వచ్చినా ఉద్యోగం దొరకని అతని అనుభవం, ప్రస్తుత జాబ్ మార్కెట్లో చాలా మంది ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పడుతోంది.

Leave a Reply