“18 ఏళ్లు గడిచినా ఇప్పటికీ డబ్బులు అందలేదు!” పాత హాజరు వివరాలు అడిగితే ఇప్పుడు ఎక్కడ వెతకాలి? 26/11 ముంబై దాడుల కేసులో అజ్మల్ కసబ్ తరఫున వాదించిన న్యాయవాదుల ఆవేదన.. అసలు కారణం ఏమిటి?

26/11 ముంబై ఉగ్రదాడులు జరిగి 18 ఏళ్లు గడుస్తున్నా.. ఆ కేసులో ఉగ్రవాది అజ్మల్ కసబ్ తరఫున వాదించిన న్యాయవాదులకు మాత్రం ఇప్పటికీ తమ ఫీజు బకాయిలు అందలేదనే విషయం తాజాగా చర్చనీయాంశమైంది.

కసబ్ అప్పీల్ కేసులో బాంబే హైకోర్టులో వాదించేందుకు 2010లో నియమితులైన న్యాయవాదులు అమీన్ సోల్కర్, ఫర్హానా షా.. తమకు రావాల్సిన ఫీజు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

మహారాష్ట్ర రాష్ట్ర న్యాయ సేవల సంస్థ (MSLSA) ఈ ఇద్దరు న్యాయవాదులను నియమించింది. వారికి రోజుకు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఫీజు నిర్ణయించినట్లు సమాచారం.

ఈ కేసు కోసం దాదాపు తొమ్మిది నెలల పాటు తమ సమయాన్ని పూర్తిగా కేటాయించామని న్యాయవాదులు తెలిపారు. విచారణకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఇతర కేసులను కూడా పక్కన పెట్టాల్సి వచ్చిందని వారు వివరించారు.

బాంబే హైకోర్టులో కేసు విచారణ ముగిసి 15 ఏళ్లకు పైగా గడిచిపోయినా.. ఎన్నిసార్లు ఫీజు కోసం విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు సరైన స్పందన రాలేదని అమీన్ సోల్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

2012 నవంబర్ 21న పుణెలోని యెరవాడ జైలులో అజ్మల్ కసబ్‌ను ఉరి తీసిన తర్వాత కూడా తమ బకాయిల చెల్లింపు మాత్రం పెండింగ్‌లోనే ఉందని వారు పేర్కొన్నారు.

ఫీజు అడిగిన ప్రతిసారీ కోర్టుకు హాజరైన తేదీలు, సమయాల వివరాలతో కూడిన పూర్తి రికార్డును సమర్పించాలని అధికారులు కోరుతున్నారని న్యాయవాదులు తెలిపారు.

అయితే, ఇన్ని సంవత్సరాల తర్వాత పాత టైమ్‌టేబుళ్లు, హాజరు వివరాలు ఎక్కడ వెతికి తీసుకురావాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం గడిచిన తర్వాత అలాంటి పాత రికార్డులను సేకరించడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే ఫీజు వివరాలు స్పష్టంగా ఉన్నప్పుడు.. మళ్లీ అనవసరమైన వివరాలు అడుగుతూ చెల్లింపులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఫర్హానా షా ప్రశ్నించారు.

తమకు రావాల్సిన ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని ఇద్దరు న్యాయవాదులు కోరుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *