ప్రపంచంలో సైన్స్‌కు కూడా అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి శాంటియాగో ఫ్లైట్ 513. ఈ కథ కేవలం ఒక విమాన ప్రమాదం గురించి మాత్రమే కాదు, ‘టైమ్ ట్రావెల్’ (కాల ప్రయాణం) అనే అంతుచిక్కని మిస్టరీతో ముడిపడి ఉందని నమ్ముతారు.
ఏం జరిగింది? సమాచారం ప్రకారం, 1954లో దక్షిణ అమెరికాలోని శాంటియాగో నుండి బ్రెజిల్‌లోని పోర్టో అలెగ్రేకు ఈ విమానం బయలుదేరింది. 18 గంటల ప్రయాణం తర్వాత ఇది గమ్యస్థానానికి చేరుకోవాలి. అయితే అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్తుండగా, ఈ విమానం అకస్మాత్తుగా రాడార్ నుండి మాయమైపోయింది. అధికారులు ఎంత వెతికినా విమానం ఆచూకీ దొరక్కపోవడంతో, అది సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావించి ఆ కేసును మూసివేశారు.
35 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం: అయితే, అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ 1989లో (35 ఏళ్ల తర్వాత) అదే విమానం అకస్మాత్తుగా పోర్టో అలెగ్రే విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని చెబుతారు. విమానం నంబర్, ఆకారం అన్నీ 1954 నాటివే ఉండటం గమనార్హం.
విమానం తలుపు తీయగానే షాక్: విమానం ఆగిన తర్వాత అధికారులు లోపలికి వెళ్లి చూడగా అక్కడి దృశ్యం చూసి వణికిపోయారు. ప్రయాణీకులందరూ తమ సీట్లలోనే ఉన్నారు, కానీ వారు కేవలం అస్థిపంజరాలుగా మారిపోయారు. పైలట్ కూడా తన సీటులోనే అస్థిపంజరంగా ఉండి విమానం నడుపుతున్నట్లు కనిపించాడు. విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కనీసం నిప్పు కూడా అంటుకోలేదు.
ఈ ఘటన ‘టైమ్ ట్రావెల్’ వల్ల జరిగిందని కొందరు అంటే, ఇదంతా కట్టుకథ అని మరికొందరు కొట్టిపారేస్తారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రభుత్వ ఆధారాలు లేవు.
