ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు సమీపంలో ప్రియుడితో కలిసి, కన్నబిడ్డ కళ్ల ముందే భర్తను కిరాతకంగా హత్య చేసిన 19 ఏళ్ల యువతిని, ఆమె ప్రియుడిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ ఘోర హత్య కేసును కేవలం కొన్ని గంటల్లోనే పోలీసులు ఛేదించారు.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా శూలగిరికి చెందిన రమేష్ (23) అనే యువకుడికి, ఆంధ్రప్రదేశ్‌లోని శాంతిపురం ప్రాంతానికి చెందిన హాసిని (19) అనే యువతికి రెండేళ్ల క్రితం వివాహమైంది. రమేష్ హోసూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ఈ దంపతులకు ఒక ఆడపిల్ల ఉంది. వీరి జీవితం బయటకు సంతోషంగా కనిపిస్తున్నప్పటికీ, హాసినికి తన చిన్ననాటి స్నేహితుడైన యుగంధర్ (20) అనే యువకుడితో పెళ్లయిన తర్వాత కూడా వివాహేతర సంబంధం కొనసాగింది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న రమేష్‌ను వదిలించుకోవాలని వారిద్దరూ కలిసి ఒక ఘోరమైన ప్లాన్ వేశారు.
పథకం ప్రకారం, గత మంగళవారం కుడుపల్లిలోని ఒక గుడికి వెళ్దామని రమేష్‌ను హాసిని బలవంతం చేసి తీసుకెళ్లింది. భర్త రమేష్ తన భార్య, బిడ్డతో కలిసి బైక్‌పై బయలుదేరాడు. దారి పొడవునా హాసిని తన ప్రియుడు యుగంధర్‌కు మొబైల్ ఫోన్ ద్వారా ‘లైవ్ లొకేషన్’ షేర్ చేస్తూ దారి చూపించింది. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులోని మూడో మలుపు (బెండ్) వద్దకు చేరుకోగానే, హాసిని కావాలనే తన హ్యాండ్‌బ్యాగ్‌ను కింద పడేసింది. ఆ బ్యాగ్ తీసుకోవడానికి రమేష్ బైక్ ఆపిన మరుక్షణమే, అక్కడ పొంచి ఉన్న యుగంధర్, అతని స్నేహితులు రమేష్‌పై ఒక్కసారిగా దాడి చేశారు.
వారి నుండి తప్పించుకోవడానికి అడవిలోకి పరుగెత్తిన రమేష్‌ను వెంటాడి వెంటాడి, పదునైన ఆయుధాలతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘోరమంతా రమేష్ చిన్నారి కూతురి కళ్ల ముందే జరిగింది. హత్య అనంతరం భర్త బైక్‌పైనే ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి హాసిని పారిపోతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మొబైల్ నంబర్లు, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని భార్య హాసిని, ప్రియుడు యుగంధర్‌తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, వీరి పెళ్లి జరిగిన సమయంలో హాసిని 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక అని గ్రామస్థులు తెలపడంతో.. ఈ కేసులో బాల్య వివాహాల నిరోధక చట్టం కింద కూడా పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
