క్రికెట్ అనేది రికార్డులు బద్దలవ్వడానికి, కొత్తవి సృష్టించబడటానికి వేదిక. కొన్నిసార్లు చరిత్ర పునరావృతమవుతుంది. ఏళ్ల క్రితం నాటి ఒక అద్భుతాన్ని మళ్ళీ ఏ బ్యాటర్ అయినా చేస్తే, అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.
ఫిబ్రవరి 11 సాయంత్రం సరిగ్గా అదే జరిగింది. టీ20 వరల్డ్ కప్ 2026లోని 15వ మ్యాచ్‌లో 2007 నాటి చరిత్ర పునరావృతమైంది. సరిగ్గా 19 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌కు యువరాజ్ సింగ్ ఇచ్చిన గాయాన్నే, ఇప్పుడు వెస్టిండీస్ ఆటగాడు ఇచ్చాడు. ముంబైలోని వాంఖడే మైదానంలో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడిన ఆ బ్యాటర్, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో 7 సిక్సర్లు బాది యువరాజ్ సింగ్‌ను గుర్తు చేశాడు.
వివరాల్లోకి వెళ్తే… వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 30 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఈ విజయానికి హీరో ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. అతను కేవలం 42 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 76 (నాటౌట్) పరుగులు చేశాడు. వెస్టిండీస్ 7 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో రూథర్‌ఫోర్డ్ క్రీజులోకి వచ్చాడు. అతను జేసన్ హోల్డర్‌తో కలిసి కేవలం 32 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, విండీస్ స్కోరును 196కు చేర్చాడు. అనంతరం బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ 166 పరుగులకే కుప్పకూలింది.
యువరాజ్ రికార్డును సమం చేసిన రూథర్‌ఫోర్డ్: 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. ఆ ఇన్నింగ్స్‌లో యువరాజ్ మొత్తం 7 సిక్సర్లు కొట్టాడు. విశేషమేమిటంటే, ఆ రోజు యువరాజ్ కూడా నంబర్ 5 పొజిషన్లోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇప్పుడు 19 ఏళ్ల తర్వాత రూథర్‌ఫోర్డ్ కూడా అదే 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి, ఇంగ్లాండ్‌పైనే ఒకే ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు బాది చరిత్రను పునరావృతం చేశాడు.
అరుదైన రికార్డు: టీ20 ప్రపంచకప్ చరిత్రలో నంబర్ 5 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి, ఒకే ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు బాదిన రికార్డు కేవలం ఇద్దరి పేరిట మాత్రమే ఉంది:
- యువరాజ్ సింగ్ (భారత్) – 2007లో ఇంగ్లాండ్‌పై.
- షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (వెస్టిండీస్) – 2026లో ఇంగ్లాండ్‌పై.
