1937 నాటి పెయింటింగ్‌లో ఐఫోన్ ఉందా..? 90 ఏళ్ల పాత చిత్రంలో బయటపడ్డ మిస్టరీ వస్తువు..! “టైమ్ ట్రావెలర్” అంటూ నెట్టింట దుమారం.. అసలు నిజం ఏమిటి..?

1937లో వేసిన ఓ పాత పెయింటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటాలియన్-అమెరికన్ చిత్రకారుడు ఉంబెర్టో రొమానో గీసిన ‘మిస్టర్ పించన్ అండ్ ది సెట్లింగ్ ఆఫ్ స్ప్రింగ్‌ఫీల్డ్’ (Mr. Pynchon and the Settling of Springfield) అనే కుడ్యచిత్రంలో (మ్యూరల్), ఒక స్థానిక అమెరికన్ తెగకు చెందిన వ్యక్తి చేతిలో పట్టుకున్న వస్తువు సరిగ్గా ఆధునిక ఐఫోన్ (iPhone) తరహాలోనే కనిపిస్తుండటమే ఈ చర్చకు కారణం.

ఆ చిత్రంలో ఉన్న వ్యక్తి దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక వస్తువును చేతిలో పట్టుకుని, ముఖానికి దగ్గరగా పెట్టుకుని ఎంతో ఆసక్తిగా చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ వస్తువు ఆకారం, అతను దాన్ని పట్టుకున్న తీరు నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న మనిషిని తలపిస్తోందని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో “ఆ కాలంలోకి టైమ్ ట్రావెలర్ ఎవరైనా వెళ్లారా?”, “1937లో వేసిన పెయింటింగ్‌లోకి భవిష్యత్తు సాంకేతికత ఎలా వచ్చింది?” అంటూ రకరకాల ఊహాగానాలు, సిద్ధాంతాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే, దీనిని నిజమైన కాల ప్రయాణానికి (Time Travel) నిదర్శనంగా భావించలేమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. ఈ చిత్రం 17వ శతాబ్దపు అమెరికా వలసల నాటి చారిత్రక నేపథ్యాన్ని వర్ణిస్తుంది. ఆ కాలంలో యూరోపియన్ వలసదారులు మరియు స్థానిక తెగల ప్రజల మధ్య జరిగిన వస్తు మార్పిడి (వ్యాపారం)లో భాగంగా.. ఆ వ్యక్తి చేతిలో ఉన్నది చిన్న చేతి అద్దం (Hand mirror) లేదా బైబిల్ వంటి ప్రార్థనా పుస్తకం అయ్యుండవచ్చని చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు.

ఉంబెర్టో రొమానో యొక్క విలక్షణమైన, ఆధునిక భావవ్యక్తీకరణ శైలిలో ఈ చిత్రం రూపుదిద్దుకోవడంతో, కొన్ని ఆకారాలు ప్రస్తుత గాడ్జెట్లతో పోలి ఉన్నట్లు భ్రమింపజేస్తున్నాయి. కాబట్టి ఆ వ్యక్తి చేతిలో ఉన్నది ఐఫోన్ అని చెప్పేందుకు ఎలాంటి చారిత్రక ఆధారం లేదు. అయినప్పటికీ, దాదాపు 90 ఏళ్ల నాటి పెయింటింగ్‌లో నేటి స్మార్ట్‌ఫోన్‌ను పోలిన ఈ చిత్రం నెటిజన్ల ఊహాశక్తికి, టైమ్ ట్రావెల్ సిద్ధాంతాలకు సరికొత్త వినోదాన్ని పంచుతోంది.


Posted

in

by

Tags: