1971 యుద్ధం: పాక్ జైళ్లలో మగ్గిపోతున్న 54 మంది భారతీయ యోధులు; ఆ నిగూఢ సత్యం ఇప్పటికీ మిస్టరీనే!

1971 యుద్ధం తర్వాత కనిపించకుండా పోయిన 54 మంది భారతీయ సాయుధ దళాల సైనికుల కుటుంబాలు, 50 ఏళ్లు గడిచినా తమ ప్రియతమ వ్యక్తులు ఎందుకు ఇంటికి తిరిగి రాలేదనే సత్యం కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నాయి. బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఆ గొప్ప యుద్ధం వీరి పేర్లను కాలగర్భంలో కలిసిపోయేలా చేసింది.

డిసెంబర్ 16, 1971 సాయంత్రం పాకిస్తాన్ భారత్‌కు లొంగిపోయింది. 93,000 మందికి పైగా పాకిస్తాన్ సైనికులను భారత్ బందీలుగా పట్టుకుంది. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద సైనిక లొంగుబాటు. భారత్ ఘనవిజయం సాధించి బంగ్లాదేశ్‌ను ఆవిర్భవింపజేసింది. కానీ, ఈ యుద్ధంలో పాకిస్తాన్‌కు చిక్కిన ఆ 54 మంది భారత సైనికుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు సమాధానం లేదు.

జైలు గోడల మధ్యే బందీలుగా..

యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధ ఖైదీలందరినీ వాపస్ పంపాలని ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్ ఆదేశించినా, పాకిస్తాన్ దానిని బేఖాతరు చేసింది. వీరందరినీ “మిస్సింగ్ ఇన్ యాక్షన్” (Missing in Action) జాబితాలో చేర్చారు. జైలు గోడల మధ్య వీరు అనుభవిస్తున్న చిత్రహింసల గురించి కాలక్రమేణా కొన్ని సాక్ష్యాలు బయటపడ్డాయి.

  • ఫోటో సాక్ష్యం: యుద్ధం ముగిసిన కొన్ని రోజుల తర్వాత (డిసెంబర్ 27, 1971), ‘టైమ్’ మ్యాగజైన్‌లో మేజర్ ఏ.కె. ఘోష్ ఫోటో ప్రచురితమైంది. ఆయన జైలులో ఉన్నట్లు ఆ ఫోటో స్పష్టం చేసింది.
  • రేడియో ధృవీకరణ: ఫ్లైట్ లెఫ్టినెంట్ వి.వి. తంబేను సజీవంగా పట్టుకున్నట్లు పాకిస్తాన్ రేడియో మరియు వార్తాపత్రికలు అప్పట్లో ధృవీకరించాయి. 1989లో ఆయన చిన్నప్ప జయంత్ జాతర్ పాకిస్తాన్ వెళ్లి ఫైసలాబాద్ జైలులో తన మేనల్లుడిని చూసినట్లు పేర్కొన్నారు, కానీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
బ్రిటిష్ పాత్రికేయురాలి సంచలన కథనం

1979లో బ్రిటిష్ చరిత్రకారిణి విక్టోరియా స్కోఫీల్డ్, జుల్ఫికర్ అలీ భుట్టో ఉరిశిక్షపై కథనం రాస్తూ ఒక భయంకరమైన విషయాన్ని వెల్లడించారు. కోట్ లఖ్‌పత్ జైలులో భుట్టో గది పక్కనే ఉన్న వార్డులో సుమారు 50 మంది భారతీయ యుద్ధ ఖైదీలు ఉన్నారని, వారు రాత్రంతా చిత్రహింసల వల్ల పిచ్చివాళ్లలా అరుస్తుండేవారని ఆమె పేర్కొన్నారు. భుట్టో స్వయంగా ఆ అరుపుల గురించి జైలు అధికారులకు ఫిర్యాదు చేశారు.

విఫలమైన దౌత్య ప్రయత్నాలు

సిమ్లా మరియు ఢిల్లీ ఒప్పందాల ప్రకారం భారత్ 93,000 మంది పాక్ సైనికులను విడుదల చేసింది. కానీ పాక్ మాత్రం మన 54 మంది యోధులను తిరిగి పంపలేదు. 1989 వరకు వారు తమ దగ్గరే ఉన్నారని అంగీకరించిన పాక్, ముషార్రఫ్ హయాం నుండి ప్లేటు ఫిరాయించింది. 2019లో అభినందన్ వర్ధమాన్‌ను 48 గంటల్లోనే రప్పించుకున్న భారత్, ఆనాడు వీరి విషయంలో ఎందుకు విఫలమైందనేది ఆ కుటుంబాల ఆవేదన.

భారత మొదటి డిఫెన్స్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా 2019లో మాట్లాడుతూ.. “మా 54 మంది యోధులు పాక్ వశంలో ఉన్నారని మాకు తెలుసు, కానీ వారిని తిరిగి ఎలా తీసుకురావాలనేదే ప్రశ్నగా మిగిలింది” అని అన్నారు.


Posted

in

by

Tags: