1971 యుద్ధం: సైన్యానికి ఇంధనం ఇచ్చేందుకు నిరాకరించిన చమురు సంస్థలు; అప్పుడు ఆగ్రహించిన ఇందిరా గాంధీ ఏం చేశారు?

న్యూఢిల్లీ: అది 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయం. భారత నౌకాదళానికి (నేవీ), వాయుసేనకూ (ఎయిర్‌ఫోర్స్) అత్యవసరంగా ఇంధనం (ఆయిల్) కావలసి వచ్చింది. అప్పట్లో భారతదేశంలో చమురు వ్యాపారమంతా అమెరికా, బ్రిటన్ కంపెనీల చేతుల్లోనే ఉండేది. ఈ విదేశీ చమురు సంస్థలు భారత సైన్యానికి ఇంధనం సరఫరా చేయడానికి నిరాకరించాయి.

ఎందుకంటే ఆ కంపెనీలు అమెరికా చేతిలో కీలుబొమ్మలుగా మారాయి. అమెరికా ఏం చెబితే అది చేశాయి. ఆ యుద్ధంలో పాకిస్తాన్ అమెరికాకు మిత్రదేశం. ఆ క్లిష్ట పరిస్థితుల్లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎంతటి సాహసోపేతమైన అడుగు వేశారంటే.. యుద్ధంలో భారత్‌కు చమురు కొరత అనేది లేకుండా చేశారు. ఆ తర్వాత ఆ విదేశీ చమురు కంపెనీల నడుం విరిచారు.

ఇది దేశ రక్షణ, సార్వభౌమాధికారానికి సంబంధించిన అత్యంత సున్నితమైన చారిత్రాత్మక ఘట్టం. భారతదేశ ఇంధన సంక్షోభం, విదేశీ చమురు సంస్థల ఏకపక్ష వైఖరితో ముడిపడి ఉన్న ఈ ఘటన.. భారత ప్రభుత్వాన్ని ఒక సంచలన నిర్ణయం తీసుకునేలా చేసింది.

1971 నాటికి భారతదేశంలోని పెట్రోలియం రంగం పూర్తిగా విదేశీ కంపెనీల గుత్తాధిపత్యంలో ఉండేది. ఇందులో అమెరికాకు చెందిన బర్మా షెల్ (Burmah Shell), ఎస్సో (Esso), కాల్టెక్స్ (Caltex) వంటి పెద్ద బహుళజాతి కంపెనీలు ఉన్నాయి. ఓఎన్‌జీసీ (ONGC) అప్పుడు ప్రారంభ దశలోనే ఉంది. అందువల్ల సైన్యానికి, దేశ అవసరాలకు కావలసిన ఇంధనం కోసం భారత్ చాలా వరకు ఈ విదేశీ రిఫైనరీలపైనే ఆధారపడాల్సి వచ్చేది.

1971 డిసెంబర్: అమెరికా ఒత్తిడి.. విదేశీ కంపెనీల తిరస్కరణ

దెబ్బకు డిసెంబర్ 1971లో యుద్ధం ప్రారంభం కాగానే భారత వాయుసేన యుద్ధ విమానాలకు, నౌకాదళ యుద్ధనౌకలకు ఇంధన అవసరం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ యుద్ధంలో అమెరికా బహిరంగంగానే పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తోంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, హెన్రీ కిసింజర్ భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో అమెరికా ఒత్తిడికి తలొగ్గి, ఈ విదేశీ చమురు కంపెనీలు భారత సైన్యానికి అదనపు చమురు సరఫరా చేయడానికి నిరాకరించాయి. యుద్ధం లాంటి అత్యవసర పరిస్థితుల్లో తమ సాధారణ సామర్థ్యానికి మించి చమురును రిఫైన్ చేయడం లేదా సరఫరా చేయడం సాధ్యం కాదంటూ వంకలు పెట్టడం ప్రారంభించాయి.

ఇందిరా ప్రభుత్వం, ఇండియన్ ఆయిల్ రంగ ప్రవేశం

విదేశీ కంపెనీల ఈ సహాయ నిరాకరణ భారత సైన్యం ముందు పెద్ద సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత్‌కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం రంగంలోకి దిగాయి. ఇండియన్ ఆయిల్ తన పూర్తి శక్తినంతా ధారపోసింది. యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తూ వాయుసేన, నౌకాదళ స్థావరాలకు ఇంధనం నిరంతరాయంగా అందేలా చూసింది. భారతీయ అధికారులు, ఇంజనీర్లు రాత్రింబవళ్లు శ్రమించి లాజిస్టిక్స్‌ను సమర్థవంతంగా నిర్వహించారు. దీనివల్ల యుద్ధరంగంలో ఒక్క విమానం గానీ, ఓడ గానీ ఇంధనం లేక ఆగిపోయే పరిస్థితి రాలేదు.

ఈ ఘటనే భారత ప్రభుత్వ కళ్లు తెరిపించింది. జాతీయ రక్షణ కోసం విదేశీ చమురు కంపెనీలపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి, ఆమె వ్యూహకర్తలకు అర్థమైంది. యుద్ధం ముగిసిన వెంటనే ఆ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి ఇందిరా ప్రభుత్వం ఆ విదేశీ కంపెనీలన్నింటినీ స్వాధీనం చేసుకుంది.

  • ఎస్సో (Esso): దీనిని స్వాధీనం చేసుకుని హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) గా మార్చారు.
  • బర్మా షెల్ (Burmah Shell): దీనిని జాతీయం చేసి భారత్ పెట్రోలియం (BPCL) గా మార్చారు.
  • కాల్టెక్స్ (Caltex): దీనిని పూర్తిగా హిందుస్థాన్ పెట్రోలియంలో విలీనం చేశారు.

విదేశీ కంపెనీల జాతీయీకరణ: భారత్ సార్వభౌమత్వ విజయం

1971 నాటి ఈ ఘటన భారత చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇది దేశాన్ని పెట్రోలియం రంగంలో స్వయంసమృద్ధి సాధించేలా, ఇంధన భద్రతను సొంత చేతుల్లోకి తీసుకునేలా ప్రేరేపించింది. ఈ చారిత్రాత్మక ఘట్టం భారత ప్రభుత్వ అధికారిక పత్రాలు, పార్లమెంటరీ చర్చలు మరియు అనేక పుస్తకాలలో స్పష్టంగా నమోదైంది.

1974 నుండి 1976 మధ్యకాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఈ విదేశీ కంపెనీలను స్వాధీనం చేసుకోవడానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, దానికి ప్రధాన ప్రాతిపదికగా ‘జాతీయ రక్షణ’ మరియు ‘యుద్ధ సమయంలో విదేశీ కంపెనీల సహాయ నిరాకరణ’ను అధికారిక కారణాలుగా పేర్కొన్నారు. అప్పటి పెట్రోలియం శాఖ మంత్రి కె.డి. మాలవీయ పార్లమెంటులో చేసిన ప్రసంగాలలో ఈ వివరాలన్నీ ఉన్నాయి. మాజీ రా (R&AW) అధికారి బి. రామన్ రాసిన “ది కావ్‌బాయ్స్ ఆఫ్ రా” (The Kaoboys of R&AW) పుస్తకంలోనూ ఈ వ్యూహాత్మక చర్యల గురించి ప్రస్తావించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ చమురు తెల్లదొరల చేతుల్లోనే!

1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ చమురుపై నియంత్రణ మాత్రం విదేశీ కంపెనీల చేతుల్లోనే ఉండిపోయింది. బ్రిటీష్ కంపెనీ బర్మా షెల్, అమెరికన్ కంపెనీలు స్టాండర్డ్ వాక్యూమ్, కాల్టెక్స్‌లు మాత్రమే ఇక్కడ చమురు విక్రయించేవి. స్వదేశీ చమురు పరిశ్రమ అనేది అస్సలు లేదు.

భారత్‌లోనే రిఫైనరీలు ఏర్పాటు చేయాలని నెహ్రూ ప్రభుత్వం కోరినప్పుడు, ఇరాన్ నుండి నేరుగా పెట్రోల్ తీసుకువచ్చి అమ్మడమే లాభదాయకమని వారు నిరాకరించారు. అప్పుడు నెహ్రూ ప్రభుత్వంలో పెట్రోలియం మంత్రిగా ఉన్న కేడీ మాలవీయ ఒక వ్యూహాత్మక ప్లాన్ వేశారు. 1957లో ఆయన సోవియట్ యూనియన్ (రష్యా) భూగర్భ శాస్త్రవేత్తలను భారత్‌కు పిలిపించారు. భారత్ స్వయంగా చమురు అన్వేషణ ప్రారంభించేలా చేశారు. అమెరికాకు ఇది పెద్ద షాక్ ఇచ్చింది.

రూపాయి-రూబుల్ చెల్లింపుతో వచ్చిన రష్యన్ షిప్

ఆగస్టు 17, 1960 న.. ‘ఎమ్‌వీ ఉజ్గోరోడ్’ (MV Uzhgorod) అనే రష్యన్ ఓడ 11,390 టన్నుల డీజిల్‌తో ముంబై రేవుకు చేరుకుంది. సోవియట్ యూనియన్ నుండి భారత్‌కు అందిన మొదటి చమురు సరఫరా ఇది. విశేషమేమిటంటే, దీనికి డాలర్లలో కాకుండా ‘రూపాయి-రూబుల్’ (Rupiah-Ruble) కరెన్సీ పద్ధతిలో చెల్లింపులు జరిగాయి. ఒక్క డాలర్ కూడా బయటకు పోలేదు. ఈ వార్తతో పాశ్చాత్య చమురు కంపెనీలు అవాక్కయ్యాయి. రష్యా తక్కువ వడ్డీకే, రూపాయిల్లోనే చెల్లింపులు అంగీకరించడం అప్పట్లో డాలర్ల కొరతతో ఉన్న భారతదేశానికి ఒక పెద్ద ఊరటగా నిలిచింది.


Posted

in

by

Tags: