1998లో జరిగిన విషాద మరణం.. వెంటాడుతున్న ఆత్మ అంటూ ప్రచారం! లారీ డ్రైవర్లు నిర్మించిన వింత ఆలయం.. పూలకు బదులుగా వాటర్ బాటిళ్లతో పూజలు.. సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో వింత ఆచారం!

సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవుడికి పూలు, పూలమాలలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు సమర్పించి పూజలు చేస్తుంటాం. కానీ లడఖ్‌లో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన ఆచారం కనిపిస్తుంది. అక్కడ ఓ ఆలయంలో పూలకు బదులుగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను సమర్పిస్తారు. ఈ వింత ఆచారం వెనుక ఓ విషాదకరమైన కథ ప్రచారంలో ఉంది.

మనాలి–లే జాతీయ రహదారిపై, సముద్ర మట్టానికి సుమారు 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రమాదకరమైన ‘కాటా లూప్స్’ ప్రాంతంలోని 19వ మలుపు వద్ద ఈ ప్రత్యేక ఆలయం ఉంది.

1998లో ఏం జరిగింది?

ఈ ఆలయం వెనుక 1998లో జరిగిన ఓ విషాద ఘటన ఉందని స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం చెబుతోంది.

ఆ ఏడాది భారీగా మంచు కురుస్తున్న సమయంలో ఓ లారీ మార్గమధ్యంలో మరమ్మతులకు గురై ఆగిపోయింది. దీంతో డ్రైవర్ సహాయం కోసం సమీపంలోని గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. లారీతో పాటు సరుకులను కాపాడేందుకు తన సహాయకుడిని అక్కడే ఉంచి వెళ్లాడు.

అయితే వాతావరణం తీవ్రంగా ప్రతికూలంగా ఉండటంతో డ్రైవర్ తిరిగి రావడానికి ఐదు రోజులు పట్టింది. ఈలోగా ఆ లారీ సహాయకుడు తిండి, ముఖ్యంగా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయినట్లు కథనం.

వెంటాడే నీడ.. నీళ్లు అడిగే ఆత్మ అంటూ ప్రచారం!

ఈ ఘటన తర్వాత ఆ మార్గంలో ప్రయాణించే కొందరు లారీ డ్రైవర్లు తమకు వింత అనుభవాలు ఎదురయ్యాయని చెప్పడం మొదలుపెట్టారు. రాత్రి వేళల్లో ఓ నీడ కనిపించి తాగడానికి నీళ్లు అడుగుతుందని, నీళ్లు ఇవ్వని వాహనాలకు ప్రమాదాలు జరుగుతాయని ప్రచారం మొదలైంది.

దీంతో ఆ మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని, తమ ప్రయాణాలు సురక్షితంగా సాగాలని కోరుకుంటూ 2001లో లారీ డ్రైవర్లు కలిసి అక్కడ ఓ చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. అప్పటి నుంచి అక్కడికి వచ్చే వాహనదారులు పూలకు బదులుగా వాటర్ బాటిళ్లను సమర్పించడం ప్రారంభించారు.

ఇలా ఇప్పటివరకు లక్షకు పైగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు అక్కడ పేరుకుపోయినట్లు కథనాలు చెబుతున్నాయి.

భక్తి పేరుతో పర్యావరణానికి ముప్పు!

అయితే ఒకప్పుడు భక్తి, భయంతో ప్రారంభమైన ఈ ఆచారం ఇప్పుడు లడఖ్‌లోని ప్రకృతి పర్యావరణానికి సమస్యగా మారుతోంది. అక్కడ పేరుకుపోతున్న ప్లాస్టిక్ బాటిళ్లు గాలికి ఎగిరిపోయి పర్వత ప్రాంతాలను కలుషితం చేస్తున్నాయి.

దీంతో పర్యావరణ ప్రేమికులు, లడఖ్ అధికారులు సందర్శకులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను అక్కడ వదిలిపెట్టకుండా, బాటిల్‌లోని కొద్దిపాటి నీటిని సమీపంలోని రాళ్లపై చల్లి తమ ప్రార్థనను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఒక విషాద ఘటన నుంచి పుట్టుకొచ్చిన ఈ వింత ఆచారం ఇప్పుడు మరో పర్యావరణ సమస్యకు కారణమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *