ఉత్తరప్రదేశ్లో ఏళ్ల తరబడి సాగుతున్న ఒక మోసం కేసు అనూహ్యమైన మలుపు తిరిగింది.
1999 నాటి ఒక చీటింగ్ కేసులో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న తారాచంద్ శర్మ.. 2019లో చనిపోయాడని చెబుతూ డెత్ సర్టిఫికెట్ సహా పలు నకిలీ పత్రాలను సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో అతడిపై ఉన్న కేసు విచారణను నిలిపివేశారు.
అయితే కొన్నేళ్ల తర్వాత, 2026 ఫిబ్రవరి 6న అతడు రోడ్డుపై స్కూటర్ నడుపుకుంటూ వెళ్లడాన్ని ఒక వ్యక్తి గమనించాడు. అతడిని గుర్తించిన సదరు వ్యక్తి వెంటనే తన మొబైల్లో ఫొటోలు తీశాడు. అనంతరం ఆ ఫొటోలతో కూడిన ఆధారాలను కోర్టులో సమర్పించడంతో.. కాగితాల్లో చనిపోయినట్లు చూపించిన వ్యక్తి వాస్తవానికి బతికే ఉన్నాడనే వ్యవహారం మళ్లీ కోర్టు విచారణకు వచ్చింది.
ఈ వివాదం 1999లో నకిలీ వీలునామా తయారు చేశాడనే ఆరోపణలతో మొదలైంది. ఆ తర్వాత కేసు నుంచి తప్పించుకునేందుకు అతడు చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్, మరణ ధ్రువీకరణ నివేదికలను సృష్టించి సమర్పించినట్లు తేలింది. ఈ కుట్రకు సహకరించిన కొందరు పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో కోర్టులో లొంగిపోయిన తారాచంద్ శర్మ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతడు బతికే ఉన్నాడనే పక్కా ఆధారాలు, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. అతడి బెయిల్ పిటిషన్ను తిరస్కరించి జైలుకు పంపాలని ఆదేశించింది. ఏళ్ల తరబడి మూలనపడిన ఒక పాత కేసు.. ఒకే ఒక్క ఫొటోతో మళ్లీ తెరపైకి వచ్చి సంచలనంగా మారింది.

Leave a Reply