కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ప్రస్తుత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చూపిన ప్రభావం, అలాగే అతని దూకుడు కోచింగ్ శైలి గురించి ఆ జట్టు స్టార్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ మనసు విప్పి మాట్లాడాడు.
మాజీ భారత ఆటగాడు ఆకాష్ చోప్రా ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ అయ్యర్ మాట్లాడుతూ, 2024 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ (KKR) ఛాంపియన్‌గా నిలవడానికి గంభీర్ మార్గదర్శకత్వమే ప్రధాన కారణమని అన్నాడు. “ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ మైదానంలోకి దిగినప్పుడు, తర్వాతి వికెట్ కోసం అంగ్క్రిష్ రఘువంశీ సిద్ధంగా ఉంటాడు. కానీ, మేము అక్కడితో ఊరుకుని కూర్చునేవాళ్ళం కాదు. నేను, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, రమణ్‌దీప్, ఆండ్రీ రస్సెల్… మేమంతా మ్యాచ్ 2వ ఓవర్ నుంచే ప్యాడ్లు కట్టుకుని మైదానంలోకి వెళ్లడానికి సిద్ధంగా ఎదురుచూస్తూ ఉండేవాళ్లం” అని అప్పటి ఉత్కంఠభరిత వాతావరణాన్ని గుర్తుచేసుకున్నాడు.
గంభీర్ వ్యూహాల గురించి మరింత వివరిస్తూ.. “మైదానంలో జరిగే మార్పులకు అనుగుణంగా, ‘వెంకీ నువ్వు వెళ్లు’, ‘తర్వాత లెఫ్ట్-రైట్ కాంబినేషన్, శ్రేయాస్, వెంకీ సిద్ధంగా ఉండండి’, లేదంటే ‘రస్సెల్‌ని పంపండి’ అంటూ గౌతమ్ సార్ ఎప్పటికప్పుడు ఆదేశాలు మారుస్తూ ఉంటారు. అందుకే ప్రత్యర్థి జట్టును మట్టికరిపించడానికి మేం ఎప్పుడూ ఆకలితో ఉన్న సింహాల్లా కాచుకుని ఉండేవాళ్లం” అని పేర్కొన్నాడు.
డ్రెస్సింగ్ రూమ్ క్రమశిక్షణ గురించి వెంకటేష్ అయ్యర్ మాట్లాడుతూ, “మా వెనుక గంభీర్ సార్ కూర్చున్నప్పుడు, మేం చెత్త షాట్లు ఆడి వచ్చి ఆయన పక్కన కూర్చోలేం. దానికి ఎవరికీ ధైర్యం కూడా సరిపోదు. ఆయన నేరుగా ఎలాంటి కఠిన నిబంధనలు విధించకపోయినా, కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్‌లో యావరేజ్ (సాధారణ) ఆటకు తావులేదన్న వాతావరణాన్ని ఆయన సృష్టించారు” అని ఆశ్చర్యంతో తెలిపాడు.

Leave a Reply