2 ఏళ్ల వరకు మొబైల్‌ అస్సలు వద్దు..! పిల్లల మెదడు అభివృద్ధిపై రీల్స్ ప్రభావం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక మార్గదర్శకాలు..!!

నేటి డిజిటల్‌ ప్రపంచంలో మొబైల్‌ ఫోన్లలో రీల్స్‌, షార్ట్‌ వీడియోలు చూసే అలవాటు పెరుగుతోంది. అయితే, ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్‌ ముందు గడపడం వారి మెదడు అభివృద్ధి, నేర్చుకునే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు వైద్య అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

రాయ్‌పూర్‌ ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం, భారత్‌లో ఐదేళ్లలోపు పిల్లలు రోజుకు సగటున రెండు గంటలకు పైగా డిజిటల్‌ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నట్లు వెల్లడైంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ మార్గదర్శకాల ప్రకారం.. 2 ఏళ్లలోపు పిల్లలకు స్క్రీన్‌ టైమ్‌ను పూర్తిగా నివారించాలి. 2 నుంచి 5 ఏళ్ల మధ్య పిల్లలకు తల్లిదండ్రుల పర్యవేక్షణలో రోజుకు గరిష్ఠంగా ఒక గంటకు మించకుండా స్క్రీన్‌ టైమ్‌ ఇవ్వాలని సూచిస్తున్నారు.

చిన్న వయసులోనే పిల్లలు గంటల తరబడి వీడియోలు చూడటం వల్ల మాట్లాడే సామర్థ్యం ఆలస్యం కావడం, విషయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే, రాత్రివేళ స్క్రీన్‌ వినియోగం నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. స్క్రీన్‌ వినియోగం వల్ల వెలువడే కాంతి మెలటోనిన్‌ స్రావాన్ని ప్రభావితం చేసి పిల్లల నిద్ర చక్రంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మొబైల్‌, ఇతర డిజిటల్‌ పరికరాల వినియోగం పెరగడంతో శారీరక వ్యాయామం, బయట ఆడుకునే సమయం కూడా తగ్గిపోతుంది. మొబైల్‌ను తీసేయగానే పిల్లలు తీవ్రంగా కోపం తెచ్చుకోవడం, మొండిగా ప్రవర్తించడం, ఏడుస్తూ మారాం చేయడం వంటి ప్రవర్తనా మార్పులు కూడా కనిపించవచ్చు.

అంతేకాకుండా.. నేర్చుకోవడానికి, సృజనాత్మకతను పెంచడానికి ఉపయోగపడే ఆటలు, పుస్తకాలు, ఇతర కార్యకలాపాలపై పిల్లలకు ఆసక్తి తగ్గి.. వెంటనే వినోదాన్ని అందించే షార్ట్‌ వీడియోలు, రీల్స్‌ వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది.

పిల్లలను మొబైల్‌కు దూరంగా ఉంచాలంటే..

2 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్‌ ఫోన్‌ చూపించడాన్ని వీలైనంత వరకు పూర్తిగా నివారించాలి. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందే మొబైల్‌, టీవీ, ఇతర స్క్రీన్‌లను పక్కన పెట్టాలి. ఆ సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో నేరుగా మాట్లాడటం, కథలు చెప్పడం, పుస్తకాలు చదివించడం, బయట ఆడించడం వంటి కార్యకలాపాలను ప్రోత్సహించాలి.

అంతేకాదు.. పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శంగా నిలవాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా మొబైల్‌ వినియోగాన్ని తగ్గిస్తే.. చిన్నారులను స్క్రీన్‌లకు దూరంగా ఉంచడం మరింత సులభమవుతుంది.


Posted

in

by

Tags: