“2 నెలలుగా పార్కులో దాగిన రహస్యం.. పట్టించిన వీధికుక్క!” గోనెసంచిలో మహిళ మృతదేహం.. బెంగళూరును ఉలిక్కిపడేలా చేసిన దారుణ హత్య!

బెంగళూరులోని కొడిగేహళ్లి ప్రాంతంలో ఉన్న గుండాంజనేయ ఆలయ పార్కులో 34 ఏళ్ల సుజాత అనే మహిళను, ఆమె రెండో భర్త ఫయాజ్ పాషా అలియాస్ కాళు (25) కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.

అనుమానంతో ఈ హత్యకు పాల్పడిన అనంతరం, మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి చెత్తకుప్ప కింద దాచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. దాదాపు రెండు నెలల పాటు ఎవరికీ తెలియకుండా ఉన్న ఈ ఘటన, నవంబర్ 6న ఓ వీధికుక్క పుర్రెను బయటకు లాగి వేయడంతో వెలుగులోకి వచ్చింది.

మొదటి భర్త మరణించిన తర్వాత తన ఐదుగురు పిల్లలను సోదరి ఇంట్లో వదిలిపెట్టి చెత్త ఏరుకునే పని చేసుకుంటూ జీవిస్తున్న సుజాత, తనకంటే తొమ్మిదేళ్లు చిన్నవాడైన పాషాను దాదాపు ఐదు నెలల క్రితం వివాహం చేసుకుంది. పార్కులు, బస్టాండ్లలో తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్న వీరిద్దరి మధ్య, సుజాత ప్రవర్తనపై అనుమానంతో తరచూ గొడవలు జరుగుతుండేవి.

రెండు నెలల క్రితం రాత్రిపూట పార్కులో ఇద్దరూ మద్యం సేవిస్తుండగా జరిగిన వాగ్వాదంలో సుజాత గొంతు కోసి హత్య చేసినట్లు పాషా పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. అనంతరం చెత్త సేకరించే గోనెసంచిలో మృతదేహాన్ని పెట్టి, దానిపై చెత్త వేసి కప్పేశాడు. గోనెసంచి పక్కనే ఉన్న ఓ బ్యాగులో లభించిన ఆధార్, పాన్ కార్డుల ఆధారంగా మృతురాలు సుజాతగా పోలీసులు గుర్తించారు.

ఉదయం నడకకు (మార్నింగ్ వాక్) వచ్చిన వారు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, యెలహంక ప్రాంతంలో ఉన్న పాషాను నవంబర్ 18న అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, కలకలాన్ని రేపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *