కర్ణాటక రాష్ట్రం గదగ్ జిల్లాకు చెందిన దంపతుల రెండు నెలల మగబిడ్డకు అకస్మాత్తుగా కడుపు ఉబ్బడంతో పాటు నిరంతరం వాంతులు అవుతుండటంతో, తల్లిదండ్రులు వెంటనే ఆ చిన్నారిని రాయచూర్ జిల్లా సింధనూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు, కడుపులో కణితి లాంటి నిర్మాణం ఉండటం చూసి విస్తుపోయారు. ఆ తర్వాత నిర్వహించిన తదుపరి (అధునాతన) పరీక్షల్లో అది సాధారణ కణితి కాదని, చిన్నారి కడుపులో మరో పిండం పెరుగుతోందని తేలడం వైద్య ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.
దీనిపై చికిత్స అందించిన డాక్టర్ శివరాజ్ మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో ఏర్పడే కవల పిండాల్లో ఒకటి మాత్రమే బాగా ఎదుగుతుందని, మరొకటి ఎదగకుండా ఆ పెరిగిన పిండం (శిశువు) శరీరంలోనే చిక్కుకుపోతుందని వివరించారు. ‘ఫీటస్ ఇన్ ఫీటు’ (Fetus in Fetu) అని పిలిచే ఈ అత్యంత అరుదైన వైద్య పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే సంభవించే అరుదైన పరిణామం. భారతదేశంలో ఇప్పటివరకు కేవలం 230 మంది పిల్లల్లో మాత్రమే ఈ పరిస్థితి తలెత్తగా, కర్ణాటక రాష్ట్రంలో నమోదైన మూడవ కేసు ఇది.
చిన్నారికి అత్యవసర చికిత్స, అదనపు వైద్య పరీక్షలు నిరంతరం అవసరం కావడంతో మెరుగైన చికిత్స కోసం బళ్లారిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రక్తపరీక్షతో పాటు ఇతర పరీక్షల పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాతే ఆ పసికందుకు శస్త్రచికిత్స (ఆపరేషన్) అవసరమా లేదా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని వైద్యులు తెలిపారు. పసికందు కడుపులో పిండం పెరుగుతున్న ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలాన్ని, విషాదాన్ని నింపింది.

Leave a Reply