ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాలోని ఒక రైల్వే స్టేషన్ సమీపంలో, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి ఒక మహిళ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
హర్సోస్ గ్రామానికి చెందిన వికాస్ పటేల్ భార్య మీనూ (30), ఆమె కుమారులు విపుల్ (4), విప్లవ్ (6) రైలు ఢీకొట్టడంతో శరీరాలు ఛిద్రమై పాపంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు చూసేవారి హృదయాలను కలచివేస్తున్నాయి.
గత ఏడేళ్ల క్రితం మీనూకు, వికాస్ పటేల్‌కు వివాహం జరిగింది. వికాస్ సూరత్ నగరంలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతడు తన భార్య మీనూ ప్రవర్తనపై అనుమానంతో, తరచూ ఫోన్ చేసి మానసికంగా వేధించేవాడు. అంతేకాకుండా, మీనూకు, ఆమె ఇద్దరు పిల్లల జీవనానికి అవసరమైన ఎలాంటి ఆర్థిక సహాయం కూడా అతడు చేసేవాడు కాదని తెలుస్తోంది. ఇంట్లో రెండు రోజులుగా తిండి లేక తల్లడిల్లిపోయిన మీనూ, పక్కింటికి వెళ్లి ఒక కిలో గోధుమ పిండి అప్పుగా అడిగింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మామ, అత్త మరియు ఆడపడుచు (వదిన) ఆమెను ‘ప్రవర్తన లేనిది’ అని దూషిస్తూ అత్యంత దారుణంగా కొట్టి హింసించారు.
గత మంగళవారం ఉదయం అత్త సుధామా దేవి, మామ లోధి పటేల్, ఆడపడుచు రేష్మ కలిసి మీనూను కొట్టి ఇంటి నుండి బయటకు గెంసేశారు. దీంతో ఏం చేయాలో తోచని మీనూ, పోలీస్ స్టేషన్‌లోని మహిళా సహాయ కేంద్రానికి (వుమెన్ హెల్ప్ డెస్క్) వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు దీన్ని ఒక సాధారణ కుటుంబ తగాదాగా భావించి, చర్యలు తీసుకుంటామని చెప్పి ఆమెను తిరిగి ఇంటికి పంపించేశారు. మీనూ ఇంటికి వెళ్లేసరికి, ఆమె గదికి తాళం వేసిన అత్తగారి కుటుంబ సభ్యులు ఆమెను లోపలికి రానివ్వలేదు. దీనిపై భర్త వికాస్‌కు మీనూ ఫోన్ చేసి ఏడ్చినప్పటికీ, అతడు కూడా సహాయం చేయడానికి నిరాకరించి చేతులెత్తేసాడు.
విషయం తెలుసుకుని మీనూ తల్లిదండ్రులు అక్కడికి రాగా, వారిని కూడా అత్తగారి కుటుంబ సభ్యులు బూతులు తిడుతూ వెళ్లగొట్టారు. ఆకలి బాధ, భర్త అనుమానం, అత్తగారి కుటుంబం పెట్టే చిత్రహింసలతో అన్ని వైపుల నుండి వేదనకు గురైన మీనూ, వేరే దారి లేక తన ఇద్దరు పసి పిల్లలను తీసుకుని వెళ్తున్న రైలు ముందు దూకి ప్రాణాలు తీసుకుంది.
ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ అధికారి దుర్గా సింగ్ మాట్లాడుతూ.. మీనూ సోదరుడు కమలేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త వికాస్, అత్త సుధామా దేవి, మామ లోధి పటేల్, ఆడపడుచు రేష్మ అనే నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో మామ, అత్త, ఆడపడుచులను అరెస్టు చేశారు. “ఆ రోజు పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా సంఘటనా స్థలానికి వెళ్లినా, లేదా అత్తగారి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించినా ఈ మూడు ప్రాణాలు దక్కేవి” అని గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతూ చెప్పారు.
