మహారాష్ట్రలోని నవీ ముంబై సమీపంలో, రూ.2 లక్షల అప్పును తిరిగి చెల్లించాలని చేసినట్లు చెబుతున్న వరుస బెదిరింపుల కారణంగా, ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకున్న ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
అపార్ట్మెంట్ 11వ అంతస్తు నుంచి తల్లి, ఇద్దరు పిల్లలు కిందకు దూకినట్లు సమాచారం. ఈ ఘటన సోమవారం రాత్రి సుమారు 8.55 గంటల సమయంలో జరిగింది. అప్పు ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు పదేపదే వేధిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పన్వేల్ ప్రాంతంలోని హీరానందాని ఫార్చ్యూన్ సిటీ అపార్ట్మెంట్లో నివసిస్తున్న మాన్సీ మచ్ఛీంద్ర పోపాటే (32). ఆమె పిల్లలు రుద్రా (11), హన్సికా (6). మాన్సీ భర్త మచ్ఛీంద్ర నారాయణ్ పోపాటే (42) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. 2024వ సంవత్సరంలో అతనికి విశ్వనాథ్ దేశాయ్, అతని కుమారుడు అరుణ్ విశ్వనాథ్ దేశాయ్ ఇద్దరూ రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ డబ్బును తిరిగి ఇవ్వడంపై గత 15 రోజులుగా భార్యాభర్తలిద్దరినీ ఫోన్ ద్వారా వీరు బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఘటన జరిగిన సోమవారం రాత్రి సుమారు 8.45 గంటల సమయంలో వారిద్దరూ పోపాటే ఇంటికి వెళ్లినట్లు సమాచారం. అప్పుడు ఇంటి ప్రధాన తలుపును కాలితో తన్ని తెరవడానికి ప్రయత్నించడంతో పాటు, కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో తిట్టి బెదిరించినట్లు ఫిర్యాదు నమోదైంది. వరుస బెదిరింపులతో మాన్సీ తీవ్ర మానసిక క్షోభకు గురైందని, ఈ కారణంగానే తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె ఈ విపరీత నిర్ణయం తీసుకుందని భర్త తన ఫిర్యాదులో తెలిపాడు.
దీంతో, రసాయనీ (Rasayani) పోలీస్ స్టేషన్లో విశ్వనాథ్ దేశాయ్, అరుణ్ విశ్వనాథ్ దేశాయ్ ఇద్దరిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, బెదిరింపులు మరియు అక్రమ ప్రవేశం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అప్పుల వ్యవహారంలో వచ్చినట్లు చెబుతున్న బెదిరింపుల వల్ల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని రేకెత్తించింది.

Leave a Reply