బ్రిటన్‌లో భార్యకు తెలియకుండా 20 ఏళ్లకు పైగా మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 60 ఏళ్లు పైబడిన వ్యక్తి, తనపై ఉన్న 60 నేరాభియోగాలను కోర్టులో అంగీకరించాడు.
గత 2004 నుండి 2025 వరకు ఈ నేరాలు జరిగినట్లు నివేదించారు. గ్రేటర్ మాంచెస్టర్ పరిధిలోని స్టాక్పోర్ట్ నగరానికి చెందిన ఆ వ్యక్తి గుర్తింపును, బాధితురాలి చట్టపరమైన గోప్యతను కాపాడే నిమిత్తం వెల్లడించలేదు.
మాంచెస్టర్‌లోని మిన్షుల్ స్ట్రీట్ క్రౌన్ కోర్టులో జరిగిన విచారణలో, లైంగిక వేధింపులు, లైంగిక దాడితో సహా అనేక ఆరోపణలను అతని ఎదుట చదివి వినిపించారు. ప్రతి ఆరోపణకు అతను “నేరం చేశాను” అని అంగీకరించినట్లు తెలిపారు. విచారణ సమయంలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు కోర్టులో ఉన్నారు. ఈ కేసు అత్యంత సంక్లిష్టమైనదని, బాధితురాలికి నిరంతరం ప్రత్యేక మద్దతు అందిస్తున్నామని గ్రేటర్ మాంచెస్టర్ పోలీస్ అధికారి రిక్ జాక్సన్ తెలిపారు.
అంతేకాకుండా, భార్య అనుమతి లేకుండా ఆమె వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను లైంగిక ప్రయోజనాల కోసం షేర్ చేసిన నేరాన్ని కూడా ఆ వ్యక్తి ఇప్పటికే అంగీకరించినట్లు సమాచారం. ఈ మహిళకే సంబంధించిన లైంగిక నేరాలలో మరో 12 మందిపై కేసులు నమోదయ్యాయి. వారి వయస్సు 28 నుండి 74 ఏళ్ల మధ్య ఉంటుందని, వారు తమపై వచ్చిన ఆరోపణలన్నింటినీ నిరాకరించారని తెలిపారు. మరొక వ్యక్తి ఇప్పటికే అదే మహిళపై జరిగిన లైంగిక నేరాన్ని అంగీకరించాడు.
ఇదిలా ఉండగా, మిగిలిన 12 మంది నిందితులపై విచారణ రాబోయే వారాల్లో కొనసాగనుంది. ఆ విచారణ పూర్తయిన తర్వాత, నేరాన్ని అంగీకరించిన భర్తకు శిక్ష ఖరారు చేసే విషయంపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. మత్తుమందు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న లైంగిక దాడి కేసుల్లో, బాధితులకు సంఘటనకు సంబంధించిన పూర్తి జ్ఞాపకాలు లేదా బలమైన ఆధారాలు లేకపోయినా, వారి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని పోలీస్ అధికారులు తెలిపారు.

Leave a Reply