20 ఏళ్లుగా భార్యకు తెలియకుండా జరిగిన ఘోరం..! మత్తుమందు ఇచ్చి ఇలాంటి దారుణమా? షాక్‌కు గురైన న్యాయస్థానం.. 60 నేరాలను అంగీకరించిన భర్త!

బ్రిటన్‌లో భార్యకు తెలియకుండా 20 ఏళ్లకు పైగా మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 60 ఏళ్ల వ్యక్తి, తనపై ఉన్న 60 నేరారోపణలను న్యాయస్థానంలో అంగీకరించాడు.

ఈ దారుణాలు 2004 నుండి 2025 వరకు జరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. బాధితురాలి చట్టపరమైన గోప్యతను కాపాడేందుకు గ్రేటర్ మాంచెస్టర్‌లోని స్టాక్‌పోర్ట్ పట్టణానికి చెందిన ఆ నిందితుడి పేరు, వివరాలను బయటపెట్టలేదు.

మాంచెస్టర్‌లోని మిన్షల్ స్ట్రీట్ క్రౌన్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా లైంగిక దాడి, లైంగిక వేధింపులు సహా పలు నేరారోపణలను అతని ఎదుట చదివి వినిపించారు. ప్రతీ ఆరోపణకూ అతను “నేను నేరస్థుడినే” అని ఒప్పుకున్నాడు. విచారణ సమయంలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు కోర్టులోనే ఉన్నారు. ఈ కేసు తీవ్రమైనది, సంక్లిష్టమైనదని, బాధితురాలికి అవసరమైన ప్రత్యేక సహాయ సహకారాలు అందిస్తున్నామని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసు అధికారి రిక్ జాక్సన్ తెలిపారు.

అంతేకాకుండా, భార్యకు తెలియకుండా ఆమె వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను లైంగిక దురుద్దేశంతో ఇతరులకు షేర్ చేసిన నేరాన్ని కూడా ఆ వ్యక్తి అంతకుముందే అంగీకరించినట్లు తెలిసింది. ఇదే మహిళపై జరిగిన లైంగిక నేరాల్లో మరో 12 మందిపై కేసులు నమోదయ్యాయి. 28 నుండి 74 ఏళ్ల వయసున్న ఆ 12 మంది తమపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండించారు. మరో వ్యక్తి మాత్రం సదరు మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఇప్పటికే ఒప్పుకున్నాడు.

ఈ క్రమంలో, మిగతా 12 మంది నిందితులపై విచారణ రాబోయే వారాల్లో కొనసాగనుంది. ఆ విచారణ పూర్తయిన తర్వాత నేరాన్ని అంగీకరించిన భర్తకు విధించే శిక్షపై కోర్టు తీర్పు వెలువరించనుంది. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడే కేసుల్లో బాధితులకు ఘటన గురించి పూర్తి జ్ఞాపకాలు లేదా బలమైన ఆధారాలు లేకపోయినా, వారి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *