ఆఫీసులో పనిచేసే సమయంలో ఒక కప్పు కాఫీ తాగడం చాలామందికి అలవాటు. కానీ, ఒక కార్యాలయంలో ఉద్యోగులు కాఫీ తాగడంపైనే నిషేధం విధించిన మేనేజర్ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాఫీ మెషిన్ ఆఫీస్ సీట్లకు కేవలం 20 సెకన్ల నడక దూరంలోనే ఉన్నప్పటికీ, అక్కడికి వెళ్లి కాఫీ తాగడానికి అనుమతి లేదని ఓ ఉద్యోగి వాపోయాడు.
సోషల్ మీడియాలో తన చేదు అనుభవాన్ని పంచుకున్న ఆ ఉద్యోగి.. ఆఫీస్‌లోని మెషిన్ కాఫీ మాత్రమే కాకుండా, ఇంటి నుంచి థర్మాస్ ఫ్లాస్క్‌లలో తెచ్చుకునే కాఫీని, బయట కొనే బాటిల్ కాఫీని తాగడాన్ని కూడా మేనేజర్ నిషేధించినట్లు తెలిపాడు. కాఫీ తాగడం వల్ల పనిపై శ్రద్ధ తగ్గుతుందనేది ఆ మేనేజర్ వాదనగా సదరు ఉద్యోగి పేర్కొన్నాడు. ఈ నిబంధన నచ్చకపోతే కావాలంటే రోజూ గంట ఆలస్యంగా ఆఫీస్‌కు రావచ్చంటూ ఆ మేనేజర్ ఉచిత సలహా ఇచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతానికి ఈ ఉద్యోగాన్ని వెంటనే వదిలేయడం ఆ ఉద్యోగికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ రంగంలో అనుభవం సాధించడానికి, తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ ఉద్యోగం ఎంతగానో ఉపయోగపడుతుందని అతడు భావిస్తున్నాడు. అయినప్పటికీ, మేనేజర్ విచిత్ర ప్రవర్తన తనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తోందని తెలిపాడు. అంతేకాకుండా, ఉద్యోగులను ఒత్తిడిలోకి నెట్టడానికి ఆఫీస్ గోడ గడియారాన్ని మేనేజర్ ఎప్పుడూ 3 నిమిషాలు ముందుగా పెడుతుంటాడని, సిబ్బంది దాన్ని సరిచేసినా మళ్లీ ముందుకు తిప్పుతుంటాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వింత నిబంధనలను, మేనేజర్ విచిత్ర ప్రవర్తనను రికార్డు చేసి పెట్టుకోవాలని, అలాగే వెంటనే వేరే మంచి ఉద్యోగం వెతుక్కోవడం ప్రారంభించాలని కొందరు సూచించారు. “చెడ్డ ఉద్యోగం కంటే చెత్త బాస్ వల్లనే చాలామంది ఉద్యోగాలను వదిలేస్తుంటారు” అనే కామెంట్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. కేవలం చిన్న కాఫీ బ్రేక్‌పై కూడా ఇలాంటి ఆంక్షలు విధించడం సరైన మేనేజ్మెంట్ విధానమేనా అనే చర్చ కూడా మొదలైంది.

Leave a Reply