మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లోని హజీరా పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత భయానక ఘటన వెలుగుచూసింది.
రేషమ్ మిల్ ప్రగతి నగర్‌కు చెందిన శివ అలియాస్ చేతన్ భదౌరియా (18) అనే విద్యార్థి, ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి ‘అంకిత్ మోమోస్’ అనే స్టాల్‌కు వెళ్లాడు. అక్కడ రూ. 20 పెట్టి మోమోస్ తీసుకున్నాడు. అయితే ప్లేట్లో కేవలం 7 మోమోలు మాత్రమే ఉండటంతో, “రూ. 20కి ఇన్ని తక్కువగా ఇచ్చావేంటి?” అని వ్యాపారి అంకిత్‌ను ప్రశ్నించాడు.
ఈ చిన్న ప్రశ్నకు తీవ్ర ఆగ్రహానికి గురైన వ్యాపారి అంకిత్, విద్యార్థిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ గొడవకు దిగాడు. మాటామాటా పెరిగి వివాదం తీవ్రరూపం దాల్చడంతో, మూకుట్లో మరుగుతున్న నూనెను తీసి విద్యార్థి శివ ముఖంపై అమాంతం పోశాడు. దీంతో శివ ముఖం, చెవులు, దవడ భాగాలు తీవ్రంగా కాలిపోయాయి.
ఈ దారుణంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం, అలజడి చెలరేగాయి. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని వెంటనే స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హజీరా పోలీసులు, పరారీలో ఉన్న దుకాణదారుడిని పట్టుకునేందుకు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply