సోషల్ మీడియాలో విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తూ 20 మంది మహిళా పోలీసులను మోసం చేసి 24 లక్షల రూపాయలను కాజేసిన వ్యక్తిని ఢిల్లీలో అరెస్టు చేశారు.
ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల విక్రాంత్ తోమర్ అనే వ్యక్తి, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను తాను ఒక పెద్ద వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని, విలాసవంతమైన కార్లు, హోటళ్ల ఫోటోలను షేర్ చేస్తూ పలువురు మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు.
కరోల్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక మహిళా పోలీసు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దిగ్భ్రాంతికరమైన నిజం వెలుగులోకి వచ్చింది. విక్రాంత్ అద్దెకు తీసుకున్న కార్లను ఉపయోగిస్తూ మహిళలకు వల వేయడమే కాకుండా, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి వారి నుంచి వివిధ కారణాలు చూపుతూ లక్షల రూపాయలు వసూలు చేశాడు.
విచారణలో, ఇతను మోసం చేసిన 20 మంది మహిళా పోలీసులు ఒకే పోలీస్ శిక్షణా విభాగానికి (ట్రైనింగ్ బ్యాచ్‌కు) చెందిన వారని తెలిసింది. అంతేకాకుండా, ఇతని ‘లివ్-ఇన్’ పార్టనర్ కూడా ఢిల్లీ పోలీసు విభాగంలో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తుండటంతో, ఆమె వద్ద నుంచి సేకరించిన వివరాలతోనే తోటి పోలీసులను ఇతను టార్గెట్ చేశాడని పోలీసులు వెల్లడించారు.
ఈ మోసపూరిత డబ్బును ‘వన్‌ఎక్స్’ (1x) బెట్టింగ్ యాప్ ద్వారా లావాదేవీలు చేసినట్లు కూడా విచారణలో బయటపడింది. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతను ఈ ఏడాది జూన్ నెలలోనే బెయిల్‌పై బయటకు రావడం గమనార్హం. ప్రస్తుతం ఇతనిని పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు.
