టెక్సాస్: మార్చి 2024 నుండి ఇప్పటివరకు ఆడిన 37 మ్యాచ్‌ల్లో స్పెయిన్ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. నేషన్స్ లీగ్, యూరో కప్, ప్రపంచకప్ టోర్నీలలో వరుస విజయాలు సాధిస్తోంది. దీనికి ప్రధాన కారణం కోచ్ లూయిస్ డి లా ఫ్యూయెంటె.
ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో ఫ్రాన్స్ జట్టును 2-0 తేడాతో స్పెయిన్ ఓడించింది. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని భావించినప్పటికీ, స్పెయిన్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఫ్రాన్స్ వ్యూహాలేవీ మైదానంలో పారలేదు. ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే ఎంబాపె లాంటి స్టార్ ప్లేయర్ కూడా పసుపు కార్డు (ఎల్లో కార్డ్) అందుకున్నాడు. స్పెయిన్ కోచ్‌గా లూయిస్ డి లా ఫ్యూయెంటె బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమైన టోర్నీలలో స్పెయిన్ ఓటమి ఎరుగదు.
చివరగా 2024లో కొలంబియాతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో స్పెయిన్ ఓడిపోయింది. ఆ తర్వాత ఆడిన నేషన్స్ లీగ్, యూరో కప్, వరల్డ్ కప్ కలిపి మొత్తం 37 మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా ఓడలేదు. గెలుపే లక్ష్యంగా స్పెయిన్ ప్రతి మ్యాచ్‌లోనూ ఆడుతోంది.
అంతేకాకుండా, యూరో కప్, ప్రపంచకప్ టోర్నీలలో వరుసగా 8 నాకౌట్ మ్యాచ్‌ల్లో గెలిచిన ఏకైక యూరోపియన్ జట్టుగా స్పెయిన్ సరికొత్త రికార్డు సృష్టించింది. దీనివల్లనే 2010 తర్వాత మళ్లీ ఫిఫా ప్రపంచకప్ ఫైనల్స్‌కు స్పెయిన్ చేరుకుంది.
ఆటగాళ్లు కూడా ఒకరికొకరు తీసిపోని విధంగా రాణిస్తున్నారు. ఈ ప్రపంచకప్ టోర్నీలో స్పెయిన్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టుకు కేవలం ఒక్క గోల్ మాత్రమే ఇచ్చింది. క్వార్టర్ ఫైనల్లో బెల్జియం జట్టు మాత్రమే స్పెయిన్‌పై ఒక్క గోల్ చేయగలిగింది. ఆ స్థాయిలో వారి డిఫెన్స్ బలంగా ఉండటంతో, ఈసారి స్పెయిన్ కప్ గెలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
