ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో, 2026వ సంవత్సరం ప్రపంచంలో రెండవ అత్యంత వేడి సంవత్సరంగా నమోదు కానున్నట్లు కనిపిస్తోంది.
యూరోపియన్ యూనియన్‌కు చెందిన వాతావరణ పరిశీలన సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం, 2026 అక్టోబర్ నెలలో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే విపరీతంగా నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది మొత్తం ఉష్ణోగ్రతలపై ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు ప్రాంతాలు వడగాల్పులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ వార్త తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.
యూరోపియన్ యూనియన్ ‘కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్’ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల ఆధారంగా 2026 ప్రపంచంలోనే రెండవ అత్యంత వేడి సంవత్సరంగా నిలిచే అవకాశం ఉంది. గతంలో 2024 సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. 2025లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో ఒకటిగా నిలిచింది. ఈ తరుణంలో, 2026లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడం.. ప్రపంచ వాతావరణ మార్పుల తీవ్రతను నొక్కి చెబుతోంది.
ముఖ్యంగా, అక్టోబర్ నెలలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. భూమి, సముద్ర ఉపరితలాలపై కూడా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ డేటా స్పష్టం చేస్తోంది. మరోవైపు, ‘ఎల్ నినో’ (El Nino) వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే ఈ ఎల్ నినో.. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, ఇది ప్రపంచ ఉష్ణోగ్రతలను మరింత పెంచే ప్రధాన కారకాల్లో ఒకటి కావచ్చు.
ఇప్పటికే పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్‌కు ఎల్ నినో కూడా తోడైతే, రాబోయే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఎండలు, కరువు, వర్షపాతంలో భారీ మార్పులు సంభవించవచ్చు. అయితే, ఎల్ నినో ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది దాని తీవ్రత, వాతావరణ మార్పులపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇలా నిరంతరం పెరుగుతుండటం భవిష్యత్తులో రాబోయే వాతావరణ విపత్తులకు తీవ్రమైన హెచ్చరికగా పరిగణించబడుతోంది.

Leave a Reply