న్యూఢిల్లీ: అమరత్వం పొందాలన్న మానవుడి కోరిక ఇకపై కేవలం కథల్లో, సినిమాల్లో మాత్రమే పరిమితం కాబోదు. మీరు 2030 వరకు బతికి ఉంటే, శాశ్వతంగా అమరులయ్యే అవకాశం ఉందని ప్రపంచ ప్రసిద్ధ భవిష్యవక్త, గూగుల్ మాజీ ఇంజనీర్ ‘రే కుర్జ్వీల్’ (Ray Kurzweil) పేర్కొన్నారు. సైన్స్, జెనెటిక్స్ మరియు రోబోటిక్స్ కలయికతో రాబోయే రోజుల్లో మనిషి మరణాన్ని జయించే సాంకేతికత వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
మైక్రోస్కోపిక్ రోబోలతో వృద్ధాప్యానికి చెక్
2030 నాటికి నానోటెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందంటే, శాస్త్రవేత్తలు ‘నానోబోట్స్’ (Nanobots) అనే అతి సూక్ష్మమైన రోబోలను తయారు చేస్తారు. వీటిని మానవ శరీరంలోని రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ రోబోలు శరీరంలో నిరంతరం ప్రవహిస్తూ, కణాల స్థితిని గమనిస్తాయి. ఏవైనా కణాలు దెబ్బతింటే వాటిని వెంటనే రిపేర్ చేస్తాయి. వృద్ధాప్యానికి కారణమయ్యే కణాలను తిరిగి యవ్వనంగా మారుస్తాయి. దీనివల్ల మనిషికి అనారోగ్యాలు రావు, వృద్ధాప్యం కూడా రాదు.
రే కుర్జ్వీల్ జోస్యాలను ఎందుకు నమ్మాలి?
రే కుర్జ్వీల్ చెప్పిన విషయాలు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లా అనిపించినా, ఆయన జోస్యాల్లో 86% ఖచ్చితంగా నిజమయ్యాయి. ఇంటర్నెట్ విప్లవం, స్మార్ట్ఫోన్ల వాడకం, ఏఐ (AI) ఆధిపత్యం గురించి ఆయన ఎప్పుడో చెప్పారు. అమెరికా ప్రభుత్వం ఇచ్చే ‘నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ’ని అందుకున్న రే కుర్జ్వీల్ తన 147 జోస్యాల్లో ఎక్కువ భాగం నిజం చేసి చూపించారు.
2029లో ఏఐతో మనిషి మేధస్సు కలయిక
2029 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మనిషి మేధస్సుతో సమానంగా మారుతుందని కుర్జ్వీల్ పేర్కొన్నారు. అప్పుడు మనిషి మెదడు నేరుగా ఏఐకి అనుసంధానించబడుతుంది. దీనివల్ల మన జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి కోట్లాది రెట్లు పెరుగుతాయి. 2045 నాటికి ప్రపంచం ‘సింగులారిటీ’ (Singularity) దశలోకి చేరుకుంటుంది. అప్పుడు మనిషి తన జ్ఞాపకాలను, చేతనను (consciousness) డిజిటల్ చిప్లలోకి అప్లోడ్ చేసుకోగలడు. తద్వారా శరీరం నశించినా, మనిషి తన డిజిటల్ రూపంలో శాశ్వతంగా జీవించి ఉంటాడు.
