ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా, యర్రగొండపాలెం, ఇందిరా నగర్‌కు చెందిన 21 ఏళ్ల ఆంజనేయులు దారుణ హత్యకు గురయ్యాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆంజనేయులు, తన అక్క వద్ద పెరుగుతున్నాడు. మే 13న అక్కతో కలిసి పెళ్లి సంబంధం కోసం వెళ్లిన ఆంజనేయులు, తిరిగి వస్తుండగా మధ్యలోనే ముఖ్యమైన పని ఉందంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. రెండు రోజులు గడిచినా ఇంటికి రాకపోవడంతో, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణలో వెలుగులోకి.. కేసు నమోదు చేసుకున్న యర్రగొండపాలెం పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆంజనేయులు ఫోన్ లొకేషన్ చివరిసారిగా పొట్టిరెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి ఆరా తీయగా, ఆ గ్రామానికి చెందిన వెంకట్రామన్, రమణ దంపతుల 15 ఏళ్ల కూతురుతో ఆంజనేయులు ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు ఆ దంపతులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి.
అసలేం జరిగింది? మే 13న రాత్రి తల్లిదండ్రులు ఇంట్లో లేరని చెప్పి, ఆ బాలిక ఆంజనేయులుకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. రాత్రి 10:30 గంటల సమయంలో ఆంజనేయులు ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు, వారిద్దరినీ అభ్యంతరకర స్థితిలో చూసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కోపంతో ఊగిపోయిన బాలిక తండ్రి వెంకట్రామన్, ఇనుప రాడ్ తీసుకుని ఆంజనేయులుపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆంజనేయులు అక్కడికక్కడే మరణించాడు.
ముక్కలు ముక్కలుగా నరికి.. హత్యను దాచిపెట్టేందుకు వెంకట్రామన్ పందిని కోసే కత్తితో ఆంజనేయులు మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. అనంతరం ఆ శరీర భాగాలను ఇంటి సమీపంలో ఉన్న 100 అడుగుల లోతైన బోర్ బావిలో పడేశాడు. నిందితులు వెంకట్రామన్, అతని భార్యతో పాటు వారి కుమార్తెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బావిలో ఉన్న మృతదేహ భాగాలను వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
