ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ‘ఆంథ్రోపిక్’ (Anthropic), తన ‘క్లాడ్ ఏఐ’ (Claude AI) మోడళ్ల ద్వారా మనుషులకు వ్యాధులను కలిగించే వైరస్లలో ఓ సరికొత్త జీవ వ్యవస్థను (బయోలాజికల్ సిస్టమ్) స్వతంత్రంగా కనుగొన్నట్లు ప్రకటించింది.
వైద్య ప్రపంచాన్నే మలుపు తిప్పిన ‘CRISPR’ జీన్ ఎడిటింగ్ (జన్యు సవరణ) విధానం లాగే ఈ కొత్త వ్యవస్థ కూడా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ కొత్త జీవ వ్యవస్థకు ‘ART’ అని పేరు పెట్టారు. మానవ పరిశోధకులు కొన్ని వారాలు లేదా నెలల తరబడి చేయాల్సిన ఈ సంక్లిష్టమైన జన్యు పరిశోధనను, సుమారు 950 క్లాడ్ ఏఐ ఏజెంట్లు కలిసి కేవలం 21 గంటల్లోనే విశ్లేషించి పూర్తి చేయడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించాయి.
అయితే, ఈ ప్రయోగశాల పరీక్షలన్నింటినీ కేవలం ఏఐ మాత్రమే ఒంటరిగా చేయలేదు. కంప్యూటర్ ఆధారిత డేటా విశ్లేషణ, మార్గదర్శకత్వాన్ని మాత్రమే క్లాడ్ ఏఐ అందించింది. నిర్దిష్ట ప్రోటీన్లను రూపొందించి పరీక్షించే ప్రధాన ప్రయోగశాల పనులను మానవ శాస్త్రవేత్తలే స్వయంగా పూర్తి చేశారు.
ప్రస్తుతం ఆంథ్రోపిక్ సంస్థ ఈ పరిశోధనా పత్రాన్ని ప్రీ-ప్రింట్ (Pre-print) రూపంలో విడుదల చేసింది. ఈ కొత్త వ్యవస్థ పూర్తి పనితీరు ఏమిటనేది ఇంకా పూర్తిస్థాయిలో తెలియరాలేదు కానీ, ప్రముఖ ఎంఐటీ (MIT) శాస్త్రవేత్తలతో సహా పలువురు నిపుణులు ఈ పరిశోధనను ప్రశంసిస్తూ స్వాగతించారు.
ప్రాథమిక పరీక్షల ప్రకారం, ఈ కొత్త ‘ART’ వ్యవస్థను భవిష్యత్తులో వైద్య అవసరాల కోసం ఉపయోగించవచ్చనే ఆశలు చిగురించాయి. ఇది మానవాళికి ఉపయోగపడే సరికొత్త వైద్య సాధనంగా మారుతుందా లేదా అనేది నిర్ధారించడానికి ప్రయోగశాల పరీక్షలు నిరంతరం కొనసాగుతున్నాయి.

Leave a Reply