21 రోజులు మాత్రమే కాపురం చేసి విడాకులు కోరిన మహిళపై కర్ణాటక హైకోర్టు సీరియస్!

బెంగళూరు: కేవలం 21 రోజుల పాటు మాత్రమే భర్తతో కలిసి ఉండి, వరకట్న వేధింపుల ఆరోపణలతో విడాకులు కోరిన మహిళకు కర్ణాటక హైకోర్టు చురకలు అంటించింది. వివాహం అనేది స్వర్గంలో నిశ్చయమై భూమిపై జరిగే ఒక పవిత్ర బంధమని కోర్టు వ్యాఖ్యానించింది. తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ ఆమె దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

విడాకులు మంజూరు చేయాలని భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జయంత్ బన్నూర్ మఠ్ మరియు జస్టిస్ ఉమేష్ ఎం. అడిగలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. “హిందూ చట్టం ప్రకారం వివాహం అనేది స్వర్గంలో నిశ్చయమై భూమిపై జరిగే బంధం” అని కోర్టు పేర్కొంది.

“హిందూ ధర్మం ప్రకారం వివాహం అనేది కేవలం ఒక ఒప్పందం కాదు. అదొక పవిత్రమైన, శాశ్వతమైన కలయిక. అగ్నిసాక్షిగా వధూవరులు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ‘ధర్మేచ, అర్థేచ, కామేచ’ అని మంత్రాలు పఠిస్తూ ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పాటిస్తామని పవిత్ర ప్రమాణం చేస్తారు” అని న్యాయస్థానం గుర్తు చేసింది.

ఇది దైవిక భాగస్వామ్యం.. ఆటపాట కాదు!

“వివాహం అనేది కేవలం ఒక సామాజిక ఒప్పందమే కాదు, అది విధి ద్వారా నిర్ణయించబడిన దైవిక భాగస్వామ్యానికి సంకేతం. కానీ, పిటిషనర్ (భార్య) వివాహాన్ని ఒక ఆటలా భావించినట్లు కనిపిస్తోంది. తన చదువును కొనసాగించడానికి పుట్టింటికి వెళ్లే ఉద్దేశంతోనే భర్తపై నిరాధారమైన ఆరోపణలు చేసినట్లు తోస్తోంది” అని ధర్మాసనం అభిప్రాయపడింది.

విడాకుల కోసమే వరకట్న వేధింపుల ఆరోపణలు

“పిటిషనర్ కేవలం 21 రోజులు మాత్రమే భర్తతో కలిసి నివసించారు. ఈ తక్కువ కాలంలో దంపతుల మధ్య ఎటువంటి తీవ్రమైన విభేదాలు లేవు. అయితే, వరకట్న వేధింపుల కారణంగానే తాను పుట్టింటికి వెళ్ళినట్లు ఆమె ఆరోపించారు. కానీ వాస్తవానికి ఆమె ఆషాఢ మాసం కారణంగానే పుట్టింటికి వెళ్లారని, భర్త వేధించి బయటకు పంపలేదని విచారణలో తేలింది. కాబట్టి ఈ ఆరోపణలు అనుమానాస్పదంగా ఉన్నాయి. భర్త నుండి విడాకులు పొందాలనే ఏకైక ఉద్దేశంతోనే ఈ వరకట్న వేధింపుల నాటకం ఆడినట్లు తెలుస్తోంది” అని కోర్టు స్పష్టం చేసింది.

కేసు నేపథ్యం ఏమిటి?

బెంగళూరుకు చెందిన ఈ జంటకు 2012 మే 30న వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత తుమకూరులోని భర్త ఇంట్లో ఆమె 21 రోజులు గడిపారు. ఆ సమయంలో అదనంగా రూ. 50 వేల వరకట్నం కావాలని భర్త వేధించాడని, అంత డబ్బు ఇవ్వలేకపోయినందుకు గొడవలు జరిగాయని ఆమె ఆరోపించారు. అనంతరం విడాకులతో పాటు శాశ్వత భరణం కోరుతూ ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేయడంతో, ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు కూడా ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చింది.


Posted

in

by

Tags: