ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ జిల్లాలో ఒక మలుపు వద్ద అదుపు తప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సుమారు 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
చిల్లాట్ సమీపంలోని చక్రతా-త్యూని ఘాట్ రోడ్డులో అక్టోబర్ 2వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి దృశ్యాలు కారులో ఉన్న కెమెరాలో (డాష్‌క్యామ్) కేవలం 22 సెకన్లలో రికార్డయ్యాయి.
ఆ వీడియోలో, ఘాట్ రోడ్డులో కారు వెళ్తుండగా అకస్మాత్తుగా అదుపు తప్పడం కనిపిస్తుంది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, మరుక్షణమే లోతైన లోయలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టర్కేష్ చౌదరి (39) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ఇద్దరు సునీల్ మండల్, రిషబ్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన లోయ చాలా లోతుగా ఉండటంతో సహాయక చర్యలు కూడా సవాలుగా మారాయి. గాయపడిన వారు లోయలో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళానికి (SDRF) సమాచారం అందించారు. తాడుల సహాయంతో సుమారు 100 మీటర్ల కిందకు దిగిన సహాయక బృందాలు.. వారిద్దరినీ సురక్షితంగా పైకి తీసుకొచ్చి, మెరుగైన చికిత్స నిమిత్తం త్యూని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడలేదు. రోడ్డు మలుపు వద్ద కారు అదుపు తప్పిందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత వెలువడిన ఈ వీడియోను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో, ఘాట్ రోడ్లలో వాహనాలు నడిపేటప్పుడు వేగం విషయంలో మరియు మలుపుల వద్ద ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

Leave a Reply