జాతీయ విద్యార్థి సంఘం ‘ఎన్ఎస్యూఐ’ (NSUI) అధ్యక్షుడు అనస్ ఖాన్‌పై ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని బహిరంగంగా చేసిన సంచలన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ’లో పాల్గొనేందుకు కాలేజీ విద్యార్థులకు డబ్బులు, పలు ఆకర్షణీయమైన బహుమతులు లంచంగా ఇచ్చారని ఆ విద్యార్థిని ‘ఆజ్ తక్’ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన ఈ ర్యాలీలో పాల్గొనేలా విద్యార్థులను సమీకరించడానికి ప్లాన్ చేశారు. సుమారు 1000 మంది విద్యార్థులు ఉన్న కాలేజీ వాట్సాప్ గ్రూపులో అనస్ ఖాన్ దీనికి సంబంధించి మెసేజ్ పంపినట్లు సమాచారం. ర్యాలీలో పాల్గొనే విద్యార్థులకు ఉచిత భోజనం, ప్రయాణ ఖర్చులు, కూల్‌డ్రింక్స్ ఇస్తామని.. కొందరికి ‘ఉచిత ర్యాపిడో రైడ్’, ‘జొమాటో’ ఆఫర్లు ఇస్తామని ఆశచూపారు. అంతేకాకుండా, ఎలాగైనా 100 మంది విద్యార్థులను ఈ ర్యాలీకి తీసుకురావాలని అనస్ ఖాన్ తీవ్రంగా ప్రయత్నించారని ఆమె ఆరోపించింది.
ఇంతేకాకుండా విద్యార్థినులను తీవ్ర అసభ్యతకు గురిచేసే వ్యవహారం కూడా బట్టబయలైంది. కాలేజీ విద్యార్థినుల గురించి ప్రస్తావించిన ఆమె, కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ‘అందంగా, ఆకర్షణీయమైన శరీర ఆకృతి ఉన్న 22 ఏళ్లలోపు కొత్త విద్యార్థినులు కావాలి’ అంటూ వివాదాస్పద మెసేజ్‌లు చక్కర్లు కొట్టాయని తెలిపింది. ఎన్నారై (NRI) పెట్టుబడిదారులను కలిసి వారికి తోడుగా వెళ్లినందుకు గానూ ఆ విద్యార్థినులకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఇస్తామంటూ వల విసిరారు. అంతేకాకుండా, ఈ ఆఫర్‌కు ఒప్పుకునే విద్యార్థినులకు అహ్మదాబాద్ వెళ్లేందుకు ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ మ్యూజిక్ కాన్సర్ట్‌కు ‘VVIP’ టికెట్లు ఇస్తామంటూ దారుణమైన బేరసారాలు ఆడారని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది.
ఈ వ్యవహారం వివాదాస్పదమైన తర్వాత కూడా, ఎన్ఎస్యూఐ (NSUI) సంస్థ ప్రారంభంలో అనస్ ఖాన్‌పై ఎలాంటి చర్యా తీసుకోలేదని ఆ విద్యార్థిని తీవ్రంగా మండిపడింది. కాలేజీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అతడిని పదవి నుంచి తొలగించకుండా మౌనంగా ఉండిపోయారని, మీడియా ఒత్తిడి పెరిగిన తర్వాతే అతను ఆలస్యంగా తన పదవికి రాజీనామా చేశాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా, పాత తేదీతో ఉన్న రాజీనామా లేఖను విడుదల చేసి ఎన్ఎస్యూఐ సంస్థ ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించింది.
మహిళల హక్కులు, భద్రత గురించి నిరంతరం గొంతెత్తే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, తన సొంత పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐలో జరిగిన ఈ అక్రమాలపై, విద్యార్థినుల భద్రత గురించి ఎందుకు ఇంకా మౌనం వహిస్తున్నారని ఆ విద్యార్థిని ఘాటుగా ప్రశ్నించింది. విద్యార్థినులను తప్పుదోవ పట్టించి వాడుకోవాలని చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై ఎన్ఎస్యూఐ బహిరంగంగా సమాధానం చెప్పాలని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply