గ్రీస్ దేశంలో 54 ఏళ్ల మహిళ ఒకరు, 22 ఏళ్లకు పైగా శీతలీకరణ పద్ధతిలో (ఫ్రోజెన్ ఎంబ్రియో) భద్రపరిచిన పిండం ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
ఈ అరుదైన ఘటన వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడమే కాకుండా, కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబంలో సరికొత్త ఆశలను చిగురింపజేసింది.
క్రిస్టినా రాప్టీ-త్సేలెపి, ఆమె భర్త కాన్స్టాంటినోస్ రాప్టీస్ 2004లో ఐవీఎఫ్ (IVF – కృత్రిమ గర్భధారణ) చికిత్స తీసుకున్నారు. ఆ చికిత్స ద్వారా వారికి ఓ కుమారుడు జన్మించాడు. ఆ సమయంలో మిగిలిపోయిన కొన్ని పిండాలను భవిష్యత్తు అవసరాల కోసం అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద భద్రపరిచారు. అయితే, 2025 అక్టోబర్లో వారి 21 ఏళ్ల కుమారుడు ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
కడుపుకోతతో అల్లాడిపోయిన ఆ దంపతులు, దశాబ్దాలుగా దాచి ఉంచిన పిండాలలో ఒకదాన్ని ఉపయోగించి మళ్లీ బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. 2025 డిసెంబర్లో ఆ పిండాన్ని క్రిస్టినా గర్భాశయంలో ప్రవేశపెట్టారు. గ్రీస్లో ఐవీఎఫ్ చికిత్సకు మహిళలకు గరిష్ట చట్టబద్ధ వయోపరిమితి 54 ఏళ్లు మాత్రమే కావడంతో, వారికి ఈ చికిత్స చేయించుకోవడానికి చాలా తక్కువ సమయమే మిగిలి ఉంది.
అనంతరం ఏథెన్స్లోని వైద్యుల పర్యవేక్షణలో ఆమె గర్భం విజయవంతమై, సెప్టెంబర్ 9న 3.49 కిలోల బరువుతో ఓ ఆరోగ్యకరమైన ఆడపిల్ల జన్మించింది. చనిపోయిన తమ కుమారుడు జియోర్జియోస్ జ్ఞాపకార్థం ఆ చిన్నారికి ‘జార్జియా’ అని నామకరణం చేశారు. కొడుకు స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, అయితే ఈ చిన్నారి రాక తమ కుటుంబంలో మళ్లీ వెలుగులను, కొత్త ఆశలను నింపిందని ఆ దంపతులు భావోద్వేగంతో వెల్లడించారు.
