22 వారాలకే పుట్టి మృత్యువును గెలిచిన 450 గ్రాముల పసికందు!

న్యాష్‌విల్లే (అమెరికా): ఆధునిక వైద్య లోకమే విస్మయానికి గురయ్యే అద్భుతం అమెరికాలో జరిగింది. కేవలం 22 వారాలకే (అపరిపక్వంగా) జన్మించి, కేవలం 450 గ్రాముల బరువున్న ఒక పసికందు, వైద్యుల నిరంతర పోరాటం ఫలితంగా మృత్యుఒడి నుంచి క్షేమంగా బయటపడి ఇంటికి చేరుకుంది.

గేబ్రియల్ గోల్డెన్ అనే పేరు గల ఈ శిశువు బతికే అవకాశాలు 5 శాతం కంటే తక్కువని వైద్యులు చెప్పారు. గేబ్రియల్ జన్మించినప్పుడు అతని చేతులు పెన్సిలంత సన్నగా ఉన్నాయి. ఆ బిడ్డ అరచేతి మొత్తం తండ్రి వేలిలోని ఒక కణుపు కంటే చిన్నదిగా ఉండేది. తల్లి కారోలిన్ గర్భం దాల్చిన 14వ వారం నుంచే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు, ఆమెకు తీవ్ర రక్తస్రావం మొదలైంది. 18వ వారంలోనే ఉమ్మనీరు పగిలిపోవడంతో, బిడ్డ బతికే ఆశలను వైద్యులు వదిలేశారు. కానీ, పుట్టిన తర్వాత ఆ పసికందు బ్రీతింగ్ ట్యూబ్‌కు స్పందించడంతో వైద్యులు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో చికిత్స ప్రారంభించారు.

సుమారు ఏడాది కాలం పాటు ఆసుపత్రిలోనే గడిపిన ఈ చిన్నారికి ఊపిరితిత్తుల వ్యాధి సోకింది. శ్వాస తీసుకోవడం సులభతరం చేయడానికి వైద్యులు గొంతుకు శస్త్రచికిత్స (Tracheostomy) చేశారు. చికిత్స సమయంలో పలుమార్లు నిమోనియా సోకి ఆ చిన్నారి ప్రాణం ప్రమాదంలో పడింది. అయినా సరే, ఏమాత్రం అధైర్యపడకుండా వైద్య బృందం అత్యాధునిక వెెంటిలేటర్ సహాయంతో చికిత్సను కొనసాగించింది. మరోవైపు తండ్రి గారెత్ తన బిడ్డ చికిత్స ఖర్చుల కోసం రోజుకు ఆరు గంటల పాటు ప్రయాణం చేస్తూ పని చేయగా, తల్లి ఆసుపత్రిలోనే ఉండి బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.

ఎట్టకేలకు ఏడాది కాలం పాటు సాగిన సుదీర్ఘ పోరాటం తర్వాత గేబ్రియల్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం బాబు మానసిక ఎదుగుదల సాధారణంగానే ఉందని, అయితే ఇంకా కొద్దిరోజుల పాటు ఆక్సిజన్ సహాయం అవసరమని వైద్యులు తెలిపారు.


Posted

in

by

Tags: