పంజాబ్ రాష్ట్రం నవాన్‌షహర్ పరిధిలోని గర్హ్‌శంకర్ ప్రాంతంలో గుండెల్ని పిండేసే ఒక ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. తమ అక్రమ సంబంధానికి అడ్డంగా ఉందనే కారణంతో.. ఒక కన్నతల్లి, ఆమె ప్రియుడు కలిసి 15 ఏళ్ల కుమార్తెను దారుణంగా హత్య చేశారు. ఆపై శవాన్ని సూట్‌కేస్‌లో కుక్కి, పెట్రోల్ పోసి తగులబెట్టారు.
గత మే 29న తన 15 ఏళ్ల కుమార్తె అకస్మాత్తుగా కనిపించకుండా పోయిందని, ఎవరో గుర్తుతెలియని వ్యక్తి పెళ్లి చేసుకుంటానని ఆశచూపి ఆమెను కిడ్నాప్ చేశాడంటూ తల్లి ఉషారాణి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి నాటకమాడింది.
ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఉషారాణి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన గుర్విందర్ సింగ్ (23) అనే యువకుడిపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ సమయంలోనే ఈ దారుణ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ప్రియుడి విచారణలో షాకింగ్ నిజాలు:
అరెస్ట్ అయిన గుర్విందర్ సింగ్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. బాలిక తల్లి ఉషారాణికి, అతనికి మధ్య చాలా కాలంగా అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. వీరి వ్యవహారాన్ని గమనించిన 15 ఏళ్ల కుమార్తె, తల్లి ప్రవర్తనను తీవ్రంగా వ్యతిరేకించింది. దీనివల్ల ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న జంటకు, బాలికకు మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఘటన జరిగిన రోజు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన గుర్విందర్ సింగ్.. ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు.
ఆ తర్వాత, హత్యను దాచడం కోసం బాలిక శవాన్ని ఒక పెద్ద సూట్‌కేస్‌లో కుక్కాడు. దానిని తన బైక్ వెనుక కట్టుకుని దట్టమైన అడవి ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం ప్రకారం అడవికి వెళ్లిన పోలీసులు.. బాలిక అస్థిపంజర అవశేషాలను స్వాధీనం చేసుకుని డీఎన్‌ఏ (DNA) పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. కేవలం అక్రమ సంబంధం కోసం కన్నకూతురినే బలితీసుకున్న తల్లి క్రూరత్వం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
