సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ 23 ఇళ్లు ఉన్న ఒక వ్యక్తి మాత్రం తానూ అద్దె ఇంట్లోనే ఉంటున్నానని చెబుతున్నాడు. ఆయనే 32 ఏళ్ల రవి శర్మ. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఈ భారత సంతతి యువకుడు ‘సెర్చ్ ప్రాపర్టీ బయర్స్ ఏజెన్సీ’ వ్యవస్థాపకుడు. ఆయన వద్ద ఉన్న మొత్తం ఆస్తుల విలువ సుమారు 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 200 కోట్లు).
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రవికి న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా, క్వీన్స్లాండ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో 20కి పైగా ఆస్తులు ఉన్నప్పటికీ, ఆయన సిడ్నీలోని ఒక అద్దె ఫ్లాట్‌లో ఉంటున్నారు. దీని కోసం ఆయన వారానికి దాదాపు 1,420 డాలర్లు (సుమారు రూ. 1.18 లక్షలు) అద్దె చెల్లిస్తున్నారు.
ఏమిటీ ‘రెంట్ వెస్టింగ్’ (Rentvesting) మ్యాజిక్?
రవి శర్మ అనుసరిస్తున్న ఈ విధానాన్ని ‘రెంట్ వెస్టింగ్’ అంటారు. అంటే, మనం నివసించాలనుకునే ఖరీదైన ప్రాంతంలో అద్దెకు ఉంటూ, భవిష్యత్తులో ధరలు బాగా పెరిగే లేదా తక్కువ ధరకు వచ్చే ప్రాంతాల్లో ఇళ్లను కొనుగోలు చేసి వాటిని పెట్టుబడిగా (Investment) మార్చుకోవడం.
అద్దె ఇంట్లోనే ఎందుకు ఉంటున్నారు? రవి చెప్పిన కారణాలు:
- పెట్టుబడికి అవకాశం: సిడ్నీ వంటి ఖరీదైన నగరంలో సొంత ఇల్లు కొనాలంటే భారీ మొత్తంలో డౌన్ పేమెంట్ కట్టాలి. అదే డబ్బుతో వేరే చోట్ల 2-3 ఇళ్లు కొని అద్దెకు ఇవ్వవచ్చని రవి భావించారు.
- డబ్బు ఇరుక్కుపోదు: సొంత ఇంట్లో కోట్లాది రూపాయలు ముంచేయడం కంటే, ఆ డబ్బును వివిధ ఆస్తులపై మళ్ళించడం వల్ల సంపద వేగంగా పెరుగుతుంది.
- ఫ్లెక్సిబిలిటీ: అద్దె ఇంట్లో ఉండటం వల్ల మనకు నచ్చిన చోట, నచ్చిన సౌకర్యాలతో ఉండే అవకాశం ఉంటుంది. ఆస్తి పన్నులు, నిర్వహణ ఖర్చుల భారం ఉండదు.
రవి తన 21వ ఏట మొదటి ఇంటిని కేవలం 1,90,000 డాలర్లకు కొనుగోలు చేశారు. పదేళ్లలో ఆయన తన పోర్ట్‌ఫోలియోను 23 ఇళ్లకు విస్తరించారు. ప్రస్తుతం ఆయనకు యూట్యూబ్‌లో ‘పర్సనల్ ఫైనాన్స్ విత్ రవి శర్మ’ అనే ఛానల్ కూడా ఉంది.
