న్యూఢిల్లీ: “ప్రస్తుత రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైపోతున్న తరుణంలో, ఒక యువతి తన 23 ఏళ్ల వయసులోనే ఏకంగా 19 ప్రభుత్వ పరీక్షల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది!” అంటే మీరు నమ్మగలరా?
అవును, ఇది అక్షరాల నిజం!
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, రాయ్‌పూర్ సమీపంలోని తిలదా అనే చిన్న ప్రాంతానికి చెందిన చారు పాండే ఈ అసాధారణ ఘనతను సొంతం చేసుకున్నారు. దేశంలోనే అత్యంత కఠినమైన పోటీ పరీక్షలుగా భావించే SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్), IBPS మరియు SBI సహా వివిధ పరీక్షలను రాసి, వరుసగా 19 ఉద్యోగాలకు ఎంపికై యావత్ దేశం తనవైపు చూసేలా చేసుకున్నారు.
ఈ అద్భుత సాధనకు గుర్తింపుగా, రాబోయే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రతిష్టాత్మక ‘అట్-హోమ్’ (At-Home) విందుకు చారు పాండేకు ఆహ్వానం అందింది. నేడు దేశంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్న చారు విజయ రహస్యం ఏంటి? ఆమె పంచుకున్న ఆసక్తికర విశేషాలు ఇవే!
సాధారణ విద్యార్థిని నుంచి అసిస్టెంట్ ఆడిటర్ వరకు!
ప్రస్తుతం చెన్నైలో కేంద్ర ప్రభుత్వ ‘అసిస్టెంట్ ఆడిటర్’ (Assistant Auditor) గా పనిచేస్తున్న చారు.. తనను తాను ఎప్పుడూ ‘అతి తెలివైన విద్యార్థిని’ అని చెప్పుకోరు. “పాఠశాల రోజుల్లో నేనొక సాధారణ విద్యార్థిని మాత్రమే. గణితం (Maths) అంటే కొంచెం ఇష్టం ఉండేది, మిగిలిన సబ్జెక్టుల్లో అందరిలాగే యావరేజ్ స్టూడెంట్‌ని. నేను ప్రొఫెసర్ కావాలని మా తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ నాకు పోటీ పరీక్షలపై ఆసక్తి కలిగింది. నా నిర్ణయానికి కుటుంబ సభ్యులు పూర్తి మద్దతు ఇచ్చారు. నా టాలెంట్ కంటే నిరంతర కృషి, క్రమశిక్షణే నన్ను ఈ స్థాయికి చేర్చాయి” అని చారు చిరునవ్వుతో చెబుతారు.
చారు పాండే ‘కూల్’ స్ట్రాటజీ:
చాలామంది అభ్యర్థులు ఒక పరీక్ష రాసిన తర్వాత ఫలితాల కోసం టెన్షన్‌తో ఎదురుచూస్తుంటారు. కానీ చారు శైలి పూర్తిగా భిన్నం! ఆమె ఒక పరీక్ష పూర్తికాగానే ఫలితం గురించి ఆలోచించకుండా, మరుక్షణమే తదుపరి పరీక్ష కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టేవారు. “ఒక పరీక్ష మెరిట్ లిస్టులో నా పేరు లేకపోయినా, తదుపరి లిస్టులో ఖచ్చితంగా ఉంటుందనే నమ్మకం నాకు ఉండేది. అందుకే పరీక్ష అయిపోగానే దాని గురించి అతిగా ఆలోచించకుండా నా తదుపరి లక్ష్యం వైపు అడుగులు వేసేదాన్ని” అని ఆమె పేర్కొన్నారు. ఈ పాజిటివ్ అప్రోచ్ ఆమెను మానసిక ఒత్తిడికి గురికాకుండా కాపాడింది.
ఓటమిని చూసి భయపడని ధైర్యం:
చారు ప్రయాణంలోనూ మొదట్లో కొన్ని ఓటములు, ఎదురుదెబ్బలు తగిలాయి. కానీ ఆమె వాటిని అవరోధాలుగా కాకుండా, విజయానికి మెట్లుగా మార్చుకున్నారు. ఓటమి అనేది ప్రయాణంలో ఒక భాగమని అర్థం చేసుకుని, ప్రతిసారి మరింత పట్టుదలతో రంగంలోకి దిగారు.
చదువే కాదు.. బిర్యానీ, టూర్లు కూడా!
24 గంటలు పుస్తకాల పురుగులా ఉంటేనే సివిల్స్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనే అపోహను చారు బద్దలు కొట్టారు. “నాకు వంట చేయడం, ట్రావెలింగ్ (ప్రయాణాలు) అంటే చాలా ఇష్టం. ఎంత పెద్ద పరీక్ష దగ్గర పడుతున్నా సరే, నా రిలాక్సేషన్ టైమ్ నేను వదులుకోలేదు. మైండ్ ఫ్రీగా ఉండటానికి వాకింగ్ చేసేదాన్ని, అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి 5 నుండి 10 రోజుల పాటు జాలీగా టూర్లు వెళ్లి వచ్చేదాన్ని” అని చారు ఆశ్చర్యపరుస్తారు. కఠిన శ్రమతో పాటు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమని ఆమె నిరూపించారు.
తదుపరి లక్ష్యం: యూపీఎస్‌సీ (UPSC)!
గణితంపై ఉన్న ఆసక్తితో ప్రభుత్వ నిధులు, పన్నుల వినియోగం గురించి తెలుసుకోవాలని ఆడిటింగ్ రంగాన్ని ఎంచుకున్న చారు.. ఇక్కడితో ఆగిపోవాలని అనుకోవడం లేదు. త్వరలో పీహెచ్‌డీ (PhD) చేయడంతో పాటు, దేశంలోనే అత్యున్నత పరీక్ష అయిన యూపీఎస్‌సీ రాసి ఐఏఎస్ (IAS) లేదా ఐపీఎస్ (IPS) అధికారిణి కావడమే తన తదుపరి లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
యువతకు చారు పాండే ఇచ్చే ‘సింపుల్’ అడ్వైస్:
ఓటములను చూసి ఎప్పుడూ నిరాశ చెందకండి. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ప్రతి ఏటా వస్తూనే ఉంటాయి.
అదృష్టాన్ని నమ్ముకోకుండా సరైన దిశలో శ్రమించండి.
నిరంతర కృషి, ఓర్పును కలిగి ఉండండి.
మీపై మీకు నమ్మకం ఉండాలి.
ఒక్క ఓటమితో మీ ప్రయాణాన్ని ఆపేయకండి!
ఎలాంటి అడ్డదారులు తొక్కకుండా, ‘క్రమశిక్షణ మరియు పట్టుదల’ అనే ఆయుధాలతో శిఖరాగ్రానికి చేరిన చారు పాండే.. నిజంగానే ఈ తరం యువతకు గొప్ప రోల్ మాడల్!

Leave a Reply