చెన్నైలోని కొలత్తూర్లో జరిగిన టీవీకే (TVK) బహిరంగ సభలో ఆదవ్ అర్జున ప్రసంగిస్తూ.. “మాకు 90 నియోజకవర్గాలు మరియు రెండున్నర ఏళ్ల ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కొందరు బేరసారాలు ఆడారు. కానీ మేము ఢిల్లీకి లొంగిపోకుండా 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం” అని ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతో విజయ్ ఎవరికీ తలవంచరని, తమకు కావాల్సింది పదవులు కాదు, ప్రజల నమ్మకమని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడితే అది సంపూర్ణ లౌకిక ప్రభుత్వంగా ఉంటుందని విజయ్ చెప్పినట్లు ఆదవ్ వెల్లడించారు.
234 స్థానాల్లో ఒంటరి పోరు: విజయ్ పార్టీని తమ కూటమిలోకి చేర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నించిందని, అయితే సీట్ల సర్దుబాటు మరియు డిప్యూటీ సీఎం పదవి విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆదవ్ అర్జున మాట్లాడుతూ.. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు.
తూత్తుకుడి ఘటనపై ఆగ్రహం: ఇటీవల తూత్తుకుడిలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని హత్యకు గురైన ఘటనపై ఆదవ్ తీవ్రంగా స్పందించారు. “ఆ ఘటన జరిగి ఆరు రోజులు గడుస్తున్నా నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ముఖ్యమంత్రి అక్కడికి ఎందుకు వెళ్లలేదు? అందుకే కోపంతో ‘మూర్ఖపు ముఖ్యమంత్రి’ అని అన్నాను. నిజాలను నిర్భయంగా చెబుతాను, దేనికీ భయపడే ప్రసక్తే లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
డీఎంకేపై విమర్శల బాణం: బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చామని ఆదవ్ గుర్తు చేశారు. “బీజేపీ మాకు శత్రువు అని డీఎంకే చెప్పగలదా? వారు గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, భవిష్యత్తులోనూ పెట్టుకోవడానికి వెనుకాడరు. కానీ మేము మొదటి నుండే స్పష్టమైన విధానంతో ఉన్నాం. మాకు డబ్బు బలం లేదు, అధికారం లేదు.. కానీ ప్రజల అండ ఉంది” అని ఆయన అన్నారు. తన కుటుంబం రాజకీయ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్నా, సామాన్యుల కోసం అన్ని వదులుకుని వచ్చానని ఆదవ్ పేర్కొన్నారు.
