25 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన భర్త.. అప్పటికే అన్న భార్యను పెళ్లాడిన తమ్ముడు! ఇప్పుడు ఆమె ఎవరికి సొంతం? పంజాబ్‌లో మైండ్ బ్లాయింగ్ ట్విస్ట్!

కపుర్తలా (పంజాబ్): ఇది ఏదో సినిమా కథో, సీరియల్ మలుపో కాదు.. పంజాబ్‌లోని కపుర్తలాలో జరిగిన నమ్మలేని నిజం! చనిపోయాడని భావించి ఏ వ్యక్తికైతే కుటుంబ సభ్యులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారో, అదే వ్యక్తి ఏకంగా 25 ఏళ్ల తర్వాత సజీవంగా ఇంటి ముందు నిలబడ్డాడు. అయితే, అతని రాక ఆ ఇంట్లో సంతోషం కంటే పెద్ద ‘ధర్మసంకటాన్ని’ సృష్టించింది. ఎందుకంటే, అతను లేని సమయంలో అతని భార్య ఇప్పుడు అతని సొంత తమ్ముడికి భార్యగా మారింది!

అసలేం జరిగింది? కపుర్తలా జిల్లాకు చెందిన హంసా సింగ్ అనే వ్యక్తి 25 ఏళ్ల క్రితం అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోవడంతో, మూడేళ్ల తర్వాత అతను చనిపోయాడని నిర్ధారించుకున్నారు. సామాజిక సంప్రదాయాల ప్రకారం, హంసా సింగ్ భార్య విమలా దేవిని అతని తమ్ముడు సుఖ్ సింగ్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. గత 22 ఏళ్లుగా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా సంసారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు హంసా సింగ్ ఎంట్రీతో ఆ కుటుంబం ఒక్కసారిగా అస్తవ్యస్తమైంది.

బిచ్చగాడి రూపంలో దర్శనం: ఉత్తరప్రదేశ్ నార్థౌర్ బజార్‌లో చిరిగిన బట్టలతో, పెరిగిన గడ్డంతో బిచ్చగాడిలా తిరుగుతున్న ఒక వ్యక్తిని చూసి పోలీసులు విచారించారు. మొదట మౌనంగా ఉన్నా, మెల్లగా తన పేరు హంసా సింగ్ అని చెప్పాడు. వెంటనే పంజాబ్ పోలీసులను సంప్రదించిన యూపీ పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 72 గంటల్లోనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేయగా హంసా సింగ్ కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో అతను తమ మనిషేనని వారు గుర్తించారు.

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి! హంసా సింగ్ తిరిగి రావడంతో కుటుంబంలో ఒకరిని కలిశామన్న ఆనందం ఉన్నా, విమలా దేవి పరిస్థితి ఇప్పుడు ‘ఇటు పులి అటు దరి’ అన్నట్లుగా మారింది. చట్టబద్ధంగా మొదటి భర్త బతికి ఉండగా చేసుకున్న రెండో పెళ్లి చెల్లదు. కానీ, మానవీయ కోణంలో చూస్తే 22 ఏళ్ల నాటి సంసారాన్ని, ముగ్గురు పిల్లలను వదిలేయడం ఎలా? అనే ప్రశ్న ఎదురవుతోంది.

ఈ విచిత్రమైన కేసు ఇప్పుడు పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా పెను చర్చకు దారితీసింది. ఆ మహిళ ఇప్పుడు తన మొదటి భర్త వద్దకు వెళ్తుందా? లేక పిల్లల కోసం రెండో భర్త (తమ్ముడు) దగ్గరే ఉంటుందా? అనేది తేలాల్సి ఉంది.


Posted

in

by

Tags: