తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడిని, సహచర పార్టీ నాయకుడే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, కలకలాన్ని రేకెత్తిస్తోంది. 26 సంవత్సరాలుగా పార్టీ కోసం శ్రమించిన ఎ. మహేష్ అనే వ్యక్తినే అత్యంత దారుణమైన రీతిలో హత్య చేశారు.
శనివారం రాత్రి కోటిలింగాల ఆలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జన్ను మధు అనే మరో కాంగ్రెస్ కార్యకర్త, ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఏర్పాటు చేసిన విందుకు మహేష్‌ను పిలిచాడు. అక్కడికి బద్రి కుమార్ అనే మరో కార్యకర్తతో పాటు ఇంకొక వ్యక్తి వచ్చారు. ఆ సమయంలో, రౌడీషీటర్ అయిన బద్రి కుమార్.. తన గురించిన సమాచారాన్ని ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుకు మహేష్ చేరవేస్తున్నాడంటూ గొడవకు దిగాడు.
వాగ్వాదం తీవ్రం కావడంతో బద్రి కుమార్ మహేష్ మొబైల్ ఫోన్‌ను లాక్కుని, అతనిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. మహేష్ ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి పరుగున వచ్చి మంటలను ఆర్పివేశారు. ఆ సమయంలో స్థానికులు తమ ఫోన్లలో రికార్డ్ చేసిన మరణ వాంగ్మూలంలో, బద్రి కుమారే తనపై నిప్పు పెట్టాడని మహేష్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా, పార్టీ ఎదుగుదల కోసం కష్టపడిన తనలాంటి సీనియర్ నాయకులకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారని, తన కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలని కోరాడు.
వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 50 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్న అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు. నిందితుడిగా ఉన్న బద్రి కుమార్ గతంలో 2018 నాటి ఒక హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడి, ఇటీవలనే బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
