27 హెయిర్‌పిన్ బెండ్‌లు.. ఏనుగులు-పులులతో నిండిన పర్యాటక ప్రాంతం.. థ్రిల్లింగ్ అనుభవం కోసం ఇక్కడికి వెళ్లండి!

తమిళనాడులో సందర్శించడానికి అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో ఈరోడ్ జిల్లాలోని ‘దింబం’ కొండ ప్రాంతం అత్యంత ప్రాచుర్యం పొందింది. తమిళనాడు – కర్ణాటక సరిహద్దులో, పశ్చిమ కనుమలలో ఉన్న ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 1,100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఏడాది పొడవునా వాతావరణం చల్లగా ఉండటం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ.

సత్యమంగళం పులుల సంరక్షణ కేంద్రం: ఈ కొండ ప్రాంతం మొత్తం దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. ఇక్కడే ప్రసిద్ధ ‘సత్యమంగళం టైగర్ రిజర్వ్’ ఉంది. పర్యాటకులు ఈ అడవుల గుండా ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ పులులు, ఏనుగులు, చిరుతపులులు, జింకలు మరియు ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ ప్రాంతాన్ని దాటేటప్పుడు పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

భవానీ సాగర్ ఆనకట్ట: అడవులను దాటిన తర్వాత, తమిళనాడులో రెండో అతిపెద్ద ఆనకట్ట అయిన ‘భవానీ సాగర్’ డ్యామ్ కనిపిస్తుంది. సముద్రంలా విస్తరించి ఉన్న ఆ నీటిని చూడటం కళ్లకు విందుగా ఉంటుంది. ఆనకట్ట పక్కన నడుస్తూ ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. పైన చూస్తే ఆకాశాన్ని తాకేలా పశ్చిమ కనుమలు, వాటిని తాకుతూ వెళ్లే మేఘాలు అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి.

27 ప్రమాదకరమైన మలుపులు: చివరగా, పర్యాటకులు ఎదురుచూసే థ్రిల్లింగ్ అనుభవం 27 హెయిర్‌పిన్ బెండ్‌లతో కూడిన దింబం ఘాట్ రోడ్డు. ఈ రహదారి చాలా ఇరుగ్గా, నిటారుగా ఉంటుంది. సాహసయాత్రను ఇష్టపడే వారికి ఈ ప్రయాణం ఒక మరపురాని అనుభూతిని మిగిలిస్తుంది. ఈరోడ్ నుండి సుమారు 74 కిలోమీటర్ల దూరంలో ఉన్న దింబం ప్రాంతానికి ఒకటిన్నర గంటల్లో చేరుకోవచ్చు.


Posted

in

by

Tags: