28 ఏళ్లుగా వాహనాన్నే తాకలేదు. 29 దేశాలు, 50,000 కి.మీ ప్రయాణం.! చివరకు సొంతూరు చేరుకున్న 57 ఏళ్ల వీరుడికి ఎదురైన భావోద్వేగ స్వాగతం.!!

ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసే ఒక రికార్డు ప్రయాణాన్ని 28 ఏళ్ల తర్వాత పూర్తి చేశాడు 57 ఏళ్ల బ్రిటిష్ మాజీ సైనికుడు కార్ల్ బుష్బీ (Karl Bushby).

దక్షిణ అమెరికాలోని చిలీ దేశంలో ప్రారంభించిన తన ప్రయాణాన్ని, ఇంగ్లాండ్‌లోని హల్ (Hull) నగరంలో ముగించాడు. 29 దేశాలను దాటి, సుమారు 50,000 కిలోమీటర్ల దూరాన్ని నడుస్తూ, ఈదుతూ దాటాడు. గత 1998 నవంబర్ 1వ తేదీన, తన 29వ ఏట ‘గొలియత్ ఎక్స్‌పెడిషన్’ (Goliath Expedition) అనే పేరుతో ఈ సవాలును అతడు ప్రారంభించాడు.

ఈ ప్రయాణం కోసం కార్ల్ రెండు కఠినమైన నియమాలను పెట్టుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మోటారు వాహనాల్లో ప్రయాణించకూడదు; ప్రయాణాన్ని పూర్తిగా ముగించే వరకు తన సొంత దేశానికి తిరిగి రాకూడదు అనేవే ఆ నియమాలు. దక్షిణ మరియు ఉత్తర అమెరికా ప్రాంతాలను నడుచుకుంటూ దాటిన అతడు, అలాస్కా మరియు రష్యా మధ్య ఉన్న ప్రమాదకరమైన బేరింగ్ జలసంధిని (Bering Strait) కూడా దాటాడు. అక్కడ మంచుతో గడ్డకట్టిన ప్రాంతాల్లో నడవడంతో పాటు, మంచు గడ్డల మధ్య ఈదుతూ ప్రయాణించాడు. ఆ తర్వాత సైబీరియా, మంగోలియా, చైనా, మధ్య ఆసియా మరియు యూరోపియన్ దేశాలను దాటుకుని ఫ్రాన్స్ చేరుకున్నాడు.

ఫ్రాన్స్ నుండి ఇంగ్లాండ్ చేరుకోవడానికి, గత అక్టోబర్ నెలలో ఇంగ్లీష్ ఛానల్ సముద్ర ప్రాంతంలో వరుసగా నాలుగు రోజుల పాటు ఈదాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ తీరానికి చేరుకున్న అతడు, అక్కడి నుండి తన సొంతూరైన హల్ నగరానికి నడుచుకుంటూ వెళ్లాడు. మొదట ఈ ప్రయాణాన్ని 12 ఏళ్లలో ముగించాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ, రష్యా వీసా సమస్యలు, 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం, కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన సరిహద్దుల మూసివేత వంటి కారణాల వల్ల ప్రయాణం 28 ఏళ్ల పాటు సాగింది.

చివరగా హల్ నగరం చేరుకున్న కార్ల్ బుష్బీకి వందలాది మంది ప్రజలు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. సుమారు 10 ఏళ్లుగా చూడని తన తల్లిని, ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న కొడుకు ఆడమ్‌ను, ఇప్పటివరకు నేరుగా కలవని 12 ఏళ్ల మనవరాలిని కలవడం మర్చిపోలేని క్షణమని అతడు ఉద్వేగంతో తెలిపాడు. 28 ఏళ్లుగా కొనసాగిన ఈ ప్రయాణం, పట్టుదలకు మరియు మనోబలానికి నిదర్శనంగా నిలిచింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *