చాలామంది మహిళలు తమకు ఎదురయ్యే కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ అవే అప్పుడప్పుడు తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. సంతాన సాఫల్య నిపుణురాలు (Fertility Specialist) డాక్టర్ మహిమ వద్దకు వచ్చిన ఒక 29 ఏళ్ల మహిళ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.
మూడు ఏళ్ల నిరీక్షణ – అంతుచిక్కని కారణం
ఈ జంటకు వివాహమై నాలుగేళ్లు కాగా, గత మూడేళ్లుగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం ఎప్పుడూ నిరాశాజనకంగానే ఉండేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భార్యాభర్తల రిపోర్టులన్నీ సాధారణంగానే (Normal) ఉన్నాయి:
- భార్యకు అండం విడుదల (Ovulation) సక్రమంగా జరుగుతోంది.
- ఆమె ఫెలోపియన్ ట్యూబ్లు బాగున్నాయి.
- భర్త వీర్య కణాల రిపోర్ట్ కూడా సాధారణంగానే ఉంది.
అనేకమంది వైద్యులు వీరిని ప్రయత్నిస్తూనే ఉండమని చెప్పారు, ఎందుకంటే వీరిది ‘అన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ’ (కారణం తెలియని సంతానలేమి) అని భావించారు. మూడు సార్లు చేసిన IUI చికిత్సలు కూడా ఫెయిల్ అయ్యాయి.
ఆ ఒక్క పరీక్షతో బయటపడిన రహస్యం
డాక్టర్ మహిమ ఆ మహిళకు పెల్విక్ పరీక్ష (Pelvic Examination) చేసినప్పుడు, ఆమెకు యోని భాగంలో దీర్ఘకాలికంగా ఇన్ఫెక్షన్ (Chronic Vaginal Infection) ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఆమెను పరీక్షించిన వైద్యులెవరూ ఈ శారీరక పరీక్ష చేయలేదని, కేవలం హార్మోన్ల ఇంజెక్షన్లు, మాత్రలు మాత్రమే ఇచ్చారని డాక్టర్ వెల్లడించారు.
డాక్టర్ ఆమెను పర్సనల్ గా ప్రశ్నించినప్పుడు ఒక కీలక విషయం తెలిసింది. కలిసేటప్పుడు (సంభోగం సమయంలో) విపరీతమైన నొప్పి లేదా మంట కలుగుతుందా? అని అడగ్గా.. ఆ మహిళ అవునని సమాధానమిచ్చింది. అయితే ఇది సహజమే అని భావించి ఆమె ఎవరికీ చెప్పలేదు.
ఇన్ఫెక్షన్ వల్ల గర్భం దాల్చడం ఎందుకు కష్టమవుతుంది?
దీర్ఘకాలిక యోని ఇన్ఫెక్షన్లు సాధారణ సంతానలేమి పరీక్షల్లో బయటపడవు. కానీ ఇవి:
- యోనిలోని బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తాయి.
- గర్భాశయ ముఖ ద్వారం (Cervical Mucus) వద్ద ఉండే జిగురు లాంటి పదార్థంపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల వీర్య కణాలు గర్భాశయంలోకి ప్రవేశించడం కష్టమవుతుంది.
- ఇది గర్భం దాల్చే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుంది.
ప్రస్తుతం ఆ మహిళకు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చికిత్స ప్రారంభించారు.
